ప్రసాద్ స్పీకర్‌గా రాణిస్తారు: సీఎం రేవంత్‌రెడ్డి
గడ్డం ప్రసాద్ శాసన సభ స్పీకర్‌గా అందరిని సమన్వయం చేసుకుంటు తన విధి నిర్వాహణను సమర్ధవంతంగా నిర్వహిస్తారనడంలో సందేహాం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

విధాత: వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ శాసన సభ స్పీకర్‌గా అందరిని సమన్వయం చేసుకుంటు తన విధి నిర్వాహణను సమర్ధవంతంగా నిర్వహిస్తారనడంలో సందేహాం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసన సభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అభినందిస్తూ సభలో ఆయన మాట్లాడారు. అన్ని పక్షాలు సహకరించి స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసి సభ నుంచి ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ సంప్రదాయం ముందు ముందు ఇలాగే కొనసాగాలన్నారు.
సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారద్రోలవచ్చని నేను ఆకాంక్షిస్తున్నానన్నారు. వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ రావడం గడ్డం ప్రసాద్ కృషి ఫలితమేనన్నారు. మంచి వైద్యం అందించేందుకు అనువైన ప్రాంతమన్నారు. ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎదిగిన ఆయన కృషి ఎంతో అభినందనీయమని, సభలో అందరి హక్కులను వారు కాపడగలరన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్‌కు బాగా తెలుసని, మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఆ తరువాత స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మాజీ మంత్రి కెటిఆర్ సీటులో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి మాట్లాడుతూ, గతంలో ఆయనతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, చేనేత వర్గాల సమస్య కోసం పనిచేశారని కొనియాడారు. తమ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆదేశం మేరకు స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్ధతు తెలియచేశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎంపిటిసి స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ వరకు ఎదిగారని కెటిఆర్ అభినందించారు. పలు పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసి సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కెటిఆర్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టి.పద్మారావు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉండడంతో బిజెపి సభ్యులు ఇంతకు ముందు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది సభ్యులచే ఇవాళ స్పీకర్ ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఆ తరువాత స్పీకర్ ప్రసాద్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
అసెంబ్లీలోనే కేబినెట్…
సమావేశం వాయిదా పడిన వెంటనే అసెంబ్లీలోని సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యజ్ఞతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ప్రధాన కార్యదర్శి, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి ప్రసంగం కావడంతో రాష్ట్ర ప్రజలకు ఏ అంశాలు తెలియచేయాలనే దానిపై మంత్రి మండలి సుధీర్ఘంగా చర్చించింది. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, ఆర్థిక వనరులు, అప్పులపై గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత పదేళ్ల కాలంలో బిఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను శాఖలవారీగా గవర్నర్ ప్రసంగంలో వివరించాలని మంత్రి మండలి తీర్మానించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేశారు. మిగతా నాలుగు గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టతనివ్వనున్నది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలపై బిఏసిలో నిర్ణయం…
అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై శుక్రవారం జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఏసి) లో నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాలక ప్రతిపక్ష సభ్యులు కూర్చుని చర్చిస్తారన్నారు.