Cm Revanth Reddy: కేటీఆర్ సూసైడ్ చేసుకుంటున్నాడా.. సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తుందా

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాలో ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారని ఒక మీడియా ప్రతినిధి అడగ్గా, కేటీఆర్ (Ktr) సూసైడ్ చేసుకుంటున్నాడా, సిరిసిల్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా అని సీఎం ఎ.రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) అన్నారు. అసెంబ్లీ లాబీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇక నుంచి అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ ఊపందుకుంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా గతేడాది అసెంబ్లీలో కుల గణన చేపట్టాలని తీర్మానం చేశామని, ఆ ప్రకారంగానే కుల గణన చేసి చట్టబద్దం చేస్తున్నామని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కుల గణన చేయడం లేదు, ఈ రోజు దేశం చరిత్రలో గుర్తుండిపోయే రోజు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ భవిష్యత్ లో ఎపుడైనా రిఫరెన్స్ డాక్యుమెంట్ అవుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం. ఇంటింటికి ప్రభుత్వ సిబ్బంది తిరిగి పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించారన్నారు. సర్వేతో 76 శాతం బీసీ, ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరగనుందన్నారు. ఈ రోజు మేము సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ ను ప్రతి రాష్ట్రం రిఫరెన్స్ గా తీసుకోనుందన్నారు. 2011 జనాభా లెక్కల ను అనుసరించి సర్వే చేశామన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చాం అంటే 33 శాతం సీట్లు కేటాయించామన్నారు.
కోర్టు ఇచ్చిన క్రిమిలేయర్ ను తిరస్కరించామని, స్థానిక ఎన్నికలో బీసీ రిజర్వేషన్ల విషయమై హైకోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశామన్నారు. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. 2014లో బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం, ఏక సభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం వెళ్తాం. ఇందు కోసం ఒక రోడ్డు మ్యాప్ పెట్టుకున్నామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేదు, వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా. సభకు రానివాళ్లు టైమ్ గురించి మాట్లాడడం శోచనీయమని రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)అన్నారు.
బీసీలకు ఓడిపోయే సీట్లిచ్చారంట..
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ఓడిపోయే సీట్లు ఇచ్చారని ఒక మీడియా ప్రతినిధి అడగ్గా, ఆలేరు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్య ఎలా గెలిచారని రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి వెంకటరెడ్డి పనిచేయడం వల్లే గెలిచారని అనగా, తనది రవ్వంత సాయమేనని, ముఖ్యమంత్రి గెలిపించారని అక్కడే ఉన్న వెంకటరెడ్డి సర్ది చెప్పారు. సూర్యాపేటలో ఆర్.దామోదర్ రెడ్డికి టిక్కట్ ఇచ్చినా గెలవలేదని రేవంత్ చురక అంటించారు. కొడంగల్ సీటు బీసీకి ఇస్తారా అని ఆ ప్రతినిధి అడగడంతో, నువ్వే పోటీ చేయి ఇస్తానంటూ రేవంత్ ముక్తసరిగా సమాధానమిచ్చారు.
10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు..
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రొసీజర్ లో భాగంగా ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ కార్యదర్శి మొత్తం పది మందికి నోటీసులు సిద్ధం చేసి పంపించగా ముగ్గురు స్వీకరించారు. మిగతా ఏడుగురు సభ్యులు తీసుకోవాల్సి ఉంది.