ఎంపీ ముఖ్యమంత్రి చౌహాన్ బంపర్ హామీ.. మెలికేంటంటే..
భోపాల్: ఎన్నికల ముంగిట మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ యువతకు శాపంగా మారిన నిరుద్యోగం సమస్యను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ హామీని ప్రకటించడం గమనార్హం.
‘రాష్ట్ర ప్రజల జీవితాల్లోంచి కష్టాలను తొలగించేస్తాను. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. అప్పుడు వారు ఎక్కడికీ వలస పోవాల్సిన అవసరం ఉండదు’ అని చెప్పారు. అయితే ఓ మెలిక కూడా పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అది స్వయం సహాయక సంఘాల్లో లేదా ఉద్యమ్ క్రాంతి యోజన కూడా అవుతుందని ఒక ఎన్నికల బహిరంగ సభలో చెప్పారు.
మధ్యప్రదేశ్ గడ్డకు, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకే తాను ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడ్డానని చెప్పుకొన్నారు. చౌహాన్ ప్రకటనపై రాష్ట్ర కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ కేకే మిశ్రా స్పందిస్తూ.. యువతను మోసం చేసేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘గత 18 ఏళ్లుగా చౌహాన్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైంది. ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఇస్తారు? ఆయన మరోసారి యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. ఈ ఏడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram