Women’s Reservation Bill
న్యూఢిల్లీ : సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా కోటా బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘1989 మేలో పంచాయతీలు, నగరపాలికల్లో మహిళలకు మూడింట ఒక వంతు స్థానాలను రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లను రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారు. అది లోక్‌సభలో ఆమోదం పొందినా.. అదే ఏడాది సెప్టెంబర్‌లో రాజ్యసభ ఆమోదం పొందేలేక పోయింది’ అని ఆయన తెలిపారు. ‘
ఇదే బిల్లును పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 1993 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టగా ఉభయ సభల ఆమోదం పొందింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పంచాయతీలు, నగరపాలికల్లో 15 లక్షల మంది మహిళలు ఎన్నికయ్యారు. అంటే దాదాపు 40శాతం’ అని ఆయన వివరించారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2010 మార్చి 9న పార్లమెంటు, రాష్ట్ర చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చారని, ఆ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా.. లోక్‌సభ దానిని చేపట్టలేదని తెలిపారు.
రాజ్యసభలో ప్రవేశపెట్టిన లేదా ఆమోదించిన బిల్లులకు కాలం చెల్లదని, కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ క్రియాశీలంగానే ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందిన మహిళా బిల్లును లోక్‌సభలోనూ ఆమోదించాలని గత తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పుడు జరిగే సమావేశాల్లో దీన్ని తప్పక ఆమోదించాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆమోదించామని తెలిపారు.