Congress | తెలంగాణలో కర్ణాటక వ్యూహం! ముందు అధికారం.. ఆ తర్వాతే సీఎం సంగతి

Congress అమలుకు సిద్దమైన కాంగ్రెస్  ఐక్యంగా పని చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ నేతలు విధాత: కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు మరింత బలాన్నిచ్చింది. కర్ణాటక ఫార్ములాను అమలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నాయకత్వం బలమైన నమ్మకంతో ఉంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరుగనుండడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీసీ నుంచి రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మాణిక్రావుఠాక్రే పూర్తిగా తెలంగాణలో […]

  • Publish Date - May 15, 2023 / 11:07 AM IST

Congress

  • అమలుకు సిద్దమైన కాంగ్రెస్
  • ఐక్యంగా పని చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ నేతలు

విధాత: కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు మరింత బలాన్నిచ్చింది. కర్ణాటక ఫార్ములాను అమలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నాయకత్వం బలమైన నమ్మకంతో ఉంది.

షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరుగనుండడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీసీ నుంచి రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మాణిక్రావుఠాక్రే పూర్తిగా తెలంగాణలో మకాం వేశారు. ఆయన అందరు ఇంచార్జీలలాగా గాంధీభవన్ మీటింగ్లకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటనలు కూడా చేస్తున్నారు.

మరో వైపు నిత్యం నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. మరో వైపు విభేదాలు వీడి నేతలంతా ముందు పార్టీ గెలుపు కోసం పని చేయాలని హిత బోధ చేశారు. రాక్రే బాధ్యతలు తీసుకున్న తరువాత నేతల ఫిర్యాదులు తగ్గాయి. ఏ ఇద్దరి నేతల మధ్య పొసగక పోయినా, పైకి మాత్రం నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య నిత్య పంచాయతీలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. పనిచేయడం మాని, ఇవేం గొడవలని అక్షింతలు వేసింది. అంతర్గత తగాదాలపై సీరియస్ అయిన రాహుల్ గాంధీ.. ఇష్టం ఉంటేనే పార్టీలో ఉండండి, పార్టీ సిద్దాంతాల కోసం పని చేయాలనుకుంటే ఉండండి.. లేకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.

రాహుల్తో పాటు కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలతో గప్చుప్గా నేతలున్నారు. మరో వైపు పార్టీనీ ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలో రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ కావడంతో గప్చుప్గా ఉన్న నేతలకు పార్టీ గట్టి కార్యక్రమాలనే అప్పగించింది. ఒకపైపు రాహుల్ జోడో యాత్ర లక్ష్యాలను ప్రజలకు వివరించడానికి పాదయాత్రలు చేయాలని ఆదేశించింది.

ఇంకో వైపు స్థానిక సమస్యలపై ఆందోళనలు చేస్తూ ప్రజలకు భరోసా కలిగించాలని ఆదేశించింది. మరో వైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో స్పష్టంగా చెప్పాలని అధిష్టానం నేతలకు స్పష్టం చేసింది. ఈ మూడు అంశాల ప్రాతిపదికగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్దేశం చేసింది.

రాష్ట్ర నాయకత్వానికి ఏమి చేయాలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఏమి చేయకూడదో కూడ స్పష్టం చేసింది. ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయకూడదని, స్టేట్మెంట్లు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. నేతలంతా సీఎం పదవిని దృష్టిలో పెట్టుకొని తాము సీఎం అభ్యర్థులమని బాహాటంగా చెప్పుకొంటే చర్యలు తప్పవ‌ని హెచ్చరించింది.

సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనేది సీఎల్పీ, అధిష్టానం చూసుకుంటాయని, ముందు తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం సమిష్టిగా కృషి చేయాలని తెలిపింది. నిత్యం ప్రజల్లో ఉండాలని, ఎవరు ఎంత పని చేస్తున్నారో… ఏ మేరకు ప్రజలను ప్రభావితం చేస్తున్నారనే విషయాన్ని అంతర్గత సర్వేల ద్వారా పరిశీలిస్తామని తెలిపినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ ఈ మేరకు నిత్యం కాంగ్రెస్ నాయకులకు గైడెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో నేతలు విభేదాలు వీడి కలిసి పని చేయడం ద్వారా ఏవిధంగా పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చారో నేతలకు వివరించినట్టు సమాచారం.

Latest News