Congress | ఖమ్మం బహిరంగ సభ.. కేసీఆర్‌ అధికారానికి చివరి రోజు: రేవంత్‌ రెడ్డి

Congress కేసీఆర్ పతనానికి పునాది వేస్తున్న పొంగులేటి, ఖమ్మం జిల్లా నేతలు త్వరలోనే ఢిల్లీకి వెళ్తాం- పెద్దలకు రాజకీయ పరిస్థితులు వివరిస్తాం కాంగ్రెస్‌కు అండగా ఉండటానికి సిద్దంగా ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు పొంగేలేటితో భేటీ అనంతరం మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విధాత: తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. […]

Congress | ఖమ్మం బహిరంగ సభ.. కేసీఆర్‌ అధికారానికి చివరి రోజు: రేవంత్‌ రెడ్డి

Congress

  • కేసీఆర్ పతనానికి పునాది వేస్తున్న పొంగులేటి, ఖమ్మం జిల్లా నేతలు
  • త్వరలోనే ఢిల్లీకి వెళ్తాం- పెద్దలకు రాజకీయ పరిస్థితులు వివరిస్తాం
  • కాంగ్రెస్‌కు అండగా ఉండటానికి సిద్దంగా ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతం
  • తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్
  • తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు
  • పొంగేలేటితో భేటీ అనంతరం మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

విధాత: తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ పెద్దల ఆదేశాల మేరకు బీఆర్‌ ఎస్‌ బహిష్కృత నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వా రి ఇండ్లకు వెళ్లి కలిశారు. పార్టీలోకి రావాలని వారిని సాదరంగా ఆహ్వానించారు.

జూపల్లిని కలిసిన తరువాత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లిన నేతలు ఆయనతో చర్చల అనంతరం పొంగులేటి నివాసం వద్ద ఎంపీ కోమటిరెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి, ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగానే ఈ నేతలందరినీ కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించామన్నారు.

సెంటిమెంట్‌తో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరితపించిన జయశంకర్ సార్ వర్దంతి నేడని, ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు రేవంత్‌ తెలిపారు. సార్‌ స్పూర్తితో ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమంలో అందరూ కలిసి వచ్చారన్నారు. జయశంకర్‌ సార్ స్ఫ‌ర్తితో విద్యార్థులు ఉద్యమించారని, వారి ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు.

తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ ప్రయోజనం చేకూరలేదని రేవంత్‌ అన్నారు. ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదని, ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు.

గులాబీ చీడను వదిలించడానికే…

తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలని రేవంత్‌ అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామన్నారు. కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగానే పొంగులేటిని కలిశామన్నారు.

రామసాయం సురేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారన్నారు. ఇక కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని మేమంతా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కీలక నేతల సూచన మేరకు ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటిని, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామన్నారు.

కేసీఆర్‌ పతనానికి పునాది

కేసీఆర్ పతనానికి పొంగులేటి, ఖమ్మం జిల్లా నేతలు పునాది వేస్తున్నారని రేవంత్‌ అన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పార్టీ పెద్దలకు వివరిస్తామని తెలిపారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ కేసీఆర్ అధికారానికి చివరి రోజు అవుతుందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కాంగ్రెస్‌కు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉందన్నారు.

విమలక్కపై పెట్టిన ఉపా కేసు ఉపసంహరించుకోవాలి

హరగోపాల్, విమలక్క , తదితర ఉద్యమకారులపై ఉపా కేసులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని రేవంత్‌ అన్నారు. విమలక్కపై పెట్టిన ఉపా కేసును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.