ఒక కాంగ్రెస్ నాయకుడు సరదాగా వేసిన డాన్స్ స్టెప్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పోలీస్ స్టేషన్ లోనే నాగార్జున డాన్స్
సోషల్ మీడియాలో వైరల్
కలిసుండే వారి మధ్య డాన్స్ చేశాను
విధాత, వరంగల్ ప్రతినిధి: ఒక కాంగ్రెస్ నాయకుడు సరదాగా వేసిన డాన్స్ స్టెప్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఇంట్లోనూ మరోచోటనో కాకుండా పోలీస్ స్టేషన్ లో చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి లోని భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీనివాస్ సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్లో డ్యాన్సులు చేశారు. ఆయన డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
తనతో కలిసి ఉండే పోలీసుల వద్ద సరదాగా ఈ డాన్స్ చేసినట్లు ఆయన చెబుతున్నప్పటికీ స్టేషన్ ఆవరణలో చేయడం విమర్శలకు తావిస్తోంది. శ్రీనివాస్ ఉదయం వాకింగ్ వెళ్లి వస్తూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఉన్న కానిస్టేబుళ్లను పలకరించారు. ఈ సందర్భంగా వారి మధ్య సాగిన మాటల్లో మీరు బాగా డాన్స్ చేస్తారంటూ సరదాగా మాట్లాడుతూ ఓ పాటను కానిస్టేబుల్ మొబైల్లో ప్లే చేయడంతో శ్రీనివాస్ కూడా స్పందించి డాన్స్ చేసినట్లు సమాచారం.
నాగార్జున నటించిన ‘నేనున్నాను’ సినిమాలోని ‘నన్నేలు మన్మధుడా’ అనే పాటకు పోలీస్ స్టేషన్లోనే డ్యాన్సులు చేశారు. ఆయన డాన్స్ చేస్తుంటే స్టేషన్‌లోని కానిస్టేబుళ్లు ఎంకరేజ్ చేశారు. ఈ సంఘటనపై పోలీస్‌శాఖలో కలకలం సృష్టించినట్లు సమాచారం.
దీనిపై శ్రీనివాస్‌ను స్పందిస్తూ డ్యాన్స్ ఎక్ససైజ్ లాంటిదని తనతో కలిసి ఉండే కానిస్టేబుళ్లకు సరదాగా చూపెట్టినట్టు వివరించారు. ఈ వీడియోను తనతో ఉన్నవాళ్లే తీశారని, తప్పుడు ఉద్దేశాలతో చేసింది కాదని వివరించారు. ఈ వీడియోను తానే ఒక గ్రూపులో పోస్టు చేయగా, దీనిని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వివరించారు.