వీరే.. మోదీ కా అస్లీ పరివార్!
మోదీకి కుటుంబమే లేదని, తల్లి చనిపోతే శిరోముండనం చేసుకోని మోదీ హిందువే కాదని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించడం, ఆ వెంటనే మేమంతా మోదీ కుటుంబమే అంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున సమాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చూసిందే

- ఢిల్లీలో సంచలనం రేపిన కాంగ్రెస్ పోస్టర్లు
- నీరవ్ మోదీ, విజయ్ మాల్యా తదితరుల ఫొటోలు
న్యూఢిల్లీ : మోదీకి కుటుంబమే లేదని, తల్లి చనిపోతే శిరోముండనం చేసుకోని మోదీ హిందువే కాదని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించడం, ఆ వెంటనే మేమంతా మోదీ కుటుంబమే అంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున సమాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చూసిందే. అయితే.. దీనికి కౌంటర్‌గా అన్నట్టు.. ఇదిగో.. మోదీ అసలు కుటుంబ సభ్యులు వీరే.. అంటూ ఢిల్లీలో వెలిసిన పోస్టర్లు దుమారం రేపాయి.
ఉత్తర, దక్షిణ ఢిల్లీతోపాటు.. మధ్యఢిల్లీలో మోదీ అసలు కుటుంబం పేరుతో పెద్ద ఎత్తున రాత్రికి రాత్రే పోస్టర్లు గోడలపై కనిపించాయి. వీటిపై దేశంలోని బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటివారి ఫొటోలు ఉన్నాయి. వాటిని కూడా దొంగల ఫొటోల తరహాలో ముద్రించారు.
ఈ పోస్టర్లు ఎవరు వేశారన్న విషయంలో బయటకు తెలియకపోయినా.. వాటి కింద యువ కాంగ్రెస్ అని రాసి ఉన్నది. దీనితో ఇది కాంగ్రెస్ శ్రేణుల పనే అన్న చర్చ నడుస్తున్నది. లాలూ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ పరివార్ అనే క్యాంపెయిన్‌ను బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తీసుకొస్తున్న తరుణంలో దీనికి గట్టి కౌంటర్‌గా ఈ పోస్టర్లు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది.
ఆ పోస్టర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు దేశం నుండి పారిపోయిన వ్యాపారవేత్తల పేర్లు, వారి ఫోటోలు కూడా వుండడంతో తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. ఇవి స్థానికంగా సంచలనం కలిగించడంతో పోలీసులు వాటిని తొలగించారు.