Congress | రైతులకు భరోసా కల్పించే పథకాలు
Congress | విధాత: తుక్కుగూడలో జరిగిన విజయభేరీ సభలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కీలక వాగ్దానాలు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 'మహిళలకు మహాలక్ష్మి పతకం కింద నెలకు రూ. 2500. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. పేద మహిళలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్. రైతు భరోసా కింద ఎకరానికి రైతుకు ఏడాదికి రూ. 15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ. 15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ. […]

Congress |
విధాత: తుక్కుగూడలో జరిగిన విజయభేరీ సభలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కీలక వాగ్దానాలు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ‘మహిళలకు మహాలక్ష్మి పతకం కింద నెలకు రూ. 2500. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. పేద మహిళలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్. రైతు భరోసా కింద ఎకరానికి రైతుకు ఏడాదికి రూ. 15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ. 15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోనస్’ ఇస్తామని వెల్లడించింది.
మహిళలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నహామీ వీటిలో ముఖ్యమైనది. ఎందుకంటే 2014 కు ముందు గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 మాత్రమే. కానీ సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్, అచ్ఛేదిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత తొమ్మిదిన్నరేళ్లలో మూడు రెట్లు పెంచింది. కొన్న రోజుల కిందట ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ. 200 తగ్గించినా పెంచిన దానికంటే తగ్గించింది తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది.
ఎన్డీఏ ప్రభుత్వం హాయంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజానీకంపై మోయలేని భారాన్ని మోపింది. మోడీ ప్రభుత్వపాలనలో ధరలు పెరగడమే కానీ తగ్గడం అన్నది లేనే లేదు. కేంద్రం ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రూ. లక్ష కోట్లకుపైగా రాయితీలు ఇచ్చింది. కానీ పేద, మధ్య తరగతిపై పడే భారాన్ని తగ్గించడానికి సబ్సిడీలు ఇవ్వాలంటే కుదరని చెప్పింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆ భారాన్ని తగ్గించడానికి ఇచ్చిన హామీ హర్షనీయం.
ఇక ఆ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో రైతు భరోసా కింద ఇచ్చే ఏడాదికి ఎకరానికి రూ. 15 వేలు, కౌలు రైతుకు కూడా రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని ప్రకటించింది. అలాగే వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పింది. రైతు స్వరాజ్య వేదిక 2022లో చేసిన అధ్యయనం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాగుదారుల్లో 36 శాతం కౌలు రైతులే. అంటే రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయనుకుంటే వీటిలో కనీసం 23 లక్షల కౌలు రైతు కుటుంబాలే ఉంటాయి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఏటా ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నా కౌలు రైతుల గురించి ప్రస్తావిస్తే అది సాధ్యం కాదని చేతులు ఎత్తేసింది. దీంతో అకాలవర్షాలతో పంట నష్టపోయినా, ఇతర కారణాలతో పంటలు సరిగా పండకపోయినా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాదు అప్పుల బారం వారి మెడపై కత్తిలా వేలాడుతున్నది. కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు, రైతు బీమా పరిహారాలు కౌలు రైతులకు అందడం లేదు. వారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి భూ యజమానులు, ప్రభుత్వం నుంచి పైసా పరిహారం అందడం లేదు. వీరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారిని ఆదుకోవాలని ప్రతిపక్షపార్టీగా అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా వారికి భరోసా కల్పిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.
ఇక పంటల మద్దతు ధర అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ప్రభుత్వం ఏటా ప్రకటించే కనీస మద్దతు ధరల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో పండే పంటల ఆధారంగా ప్రకటిస్తే న్యాయం జరుగుతుంది. కానీ కేంద్రం దక్షిణాది రైతుల గురించి ఆలోచించడం లేదు. ఇక్కడి ప్రజాప్రతినిదుల విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ముఖ్యంగా తెలంగాణలో సాగు చేసే రైతులు ఎక్కువగా పండించేంది పంట వరి. ఈ పంటకు ఏటా కేంద్రం ప్రకటించే మద్దతు ధర వల్ల రైతులకు ఏ మేలు జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోనస్ ఇస్తామనడం పట్ల రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వరి పంట సాగు చేసేవారికి లాభం చేకూరుతుంది అంటున్నారు.
మాటిస్తే నెరవేర్చే పార్టీ కాంగ్రెస్: ఖర్గే
కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్నికాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇదే తీరుగా ఈ రోజు విజయ భేరీ సభా వేదికగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి తీరుతామన్నారు.
ఈ సభా వేదికపై రైతు భరోసా గ్యారెంటీ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు, భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు అందిస్తామన్నారు. అలాగే వరి పంటకు గిట్టుబాటు ధరతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తామని వెల్లడించారు. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థలన్నింటినీ మోదీ అమ్మేస్తున్నారన్నారు. బీఆరెస్ బీజేపీకి బీ టీమ్ అని అన్నారు. ఒకవైపు మోదీ దేశాన్ని దోచుకుంటుంటే, ఇంకోవైపు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమనిపిస్తోందన్నారు.
కష్టాలు తీర్చడానికే తెలంగాణ గడ్డపై కాలు మోపిన సోనియా: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
బీఆరెస్ పాలనలో పడ్డ తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికే సోనియా గాంధీ ఈ గడ్డపై కాలు మోపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా రాకతో తెలంగాణ నేల పులకరించిందన్నారు. తొమ్మిదేళ్ల బీఆరెస్ పాలనలో రాష్ట్రంలో విధ్వసం జరిగిందన్నారు. విజయభేరి సభ నిర్వహించకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నాయన్నారు. సభ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నించాయని ఆరోపించారు.
సభ కోసం పరేడ్ గ్రౌండ్ కు అనుమతి అడిగితే కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. గచ్చిబౌలి స్టేడియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. తుక్కుగూడలో సభ జరుపుకుందామంటే దేవదాయ భూమి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. అయినా ఇక్కడి రైతులు ముందుకొచ్చి ఈ సభకు భూమి ఇచ్చారన్నారని తెలిపారు.
మీరంతా లక్షలాదిగా తరలివచ్చి విజయభేరిని విజయవంతం చేశారని సభకు హాజరైన ప్రజలనుద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అయితే వచ్చిన తెలంగాణలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. విజయభేరి సభలో విడుదల చేసిన గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని రేవంత్ తెలిపారు.
విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీలు
1. మహాలక్ష్మీ
అ. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సహాయం
ఆ. రూ. 500 కు గ్యాస్ సిలిండర్ అందజేత
ఇ. మహిళలకు రాష్టమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం
2. రైతు భరోసా
అ. ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000
ఆ. వరిపంటకు మద్దతు ధరకు అధనంగా క్వింటాల్‌కు రూ. 500 బోనస్.
3. గృహ జ్యోతి
అ. అన్ని కుటుంబాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్తు
4. ఇందిరమ్మ ఇండ్లు
అ. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటిస్థలం,రూ. 5 లక్షల ఆర్థిక సాయం
ఆ. అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చ. గజాల ఇంటి స్థలం
5.యువ వికాసం
అ. విద్య భరోసా కార్డు – విద్యార్థికి రూ. 5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీరహిత ఆర్ధిక సహాయం. కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ పయ్రాణ ఖర్చులు,ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీమెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు , స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు మరియు ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయకల్పన
ఆ. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు
6. చేయూత
అ. ప్రతి నెలా రూ.4,000 చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత
ఆ. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు