Congress
విధాత: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు రోజురోజుకు మరింత ముదురుతుంది. గత ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిన పాల్వాయి స్రవంతికి పోటీగా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ అశిస్తున్న చల్లమల కృష్ణారెడ్డి, బీసీ నేత పున్న కైలాష్ ల మధ్య సాగుతున్న వర్గపోరు నియోజకవర్గ రాజకీయాల్లో పార్టీ ఫ్రతిష్టను మరింత రచ్చకెక్కిస్తుంది.
తాజాగా నియోజకవర్గం మండల కాంగ్రెస్ కమిటీ నియామకాల్లో చల్లమల్ల వర్గీయులకు పెద్దపీట వేయడంతో ఆ కమిటీలను రద్ధు చేయాలని డిమాండ్ చేస్తు స్రవంతి, పున్న కైలాష్‌లు తమ అనుచరులతో కలిసి శుక్ర వారం గాంధీభవన్ వద్ధ నిరసనకు దిగి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని సైతం నిలదీశారు.
ఈ క్రమంలో చల్లమల్ల మండలాల్లో తన అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. చల్లమల్ల వైఖరిపై
గుర్రుగా ఉన్న స్రవంతి, కైలాష్ వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా తమ కేడర్‌ను సమీకరిస్తున్నారు. ఆదివారం పున్న కైలాష్ వర్గీయులు చల్లమల్ల ఫ్లెక్సీకి శవయాత్ర నిర్వహించారు. దళిత, బహుజన వ్యతిరేకి చల్లమల అంటు నినాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న చల్లమల వర్గీయులు శవయాత్రను అడ్డుకోగా రెండు వర్గాల మధ్య వాగ్వివాదం తోపులాట సాగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను అక్కడి నుండి పంపించారు. ఈ సందర్భంగా కైలాష్ వర్గీయులు మాట్లాడుతు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎందుకు అడుగరాదంటు ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో పని చేసి, కాంగ్రెస్‌కు ఏళ్ల తరబడి సేవలందించిన బీసీ నేత పున్న కైలాష్ టికెట్ అడిగితే ఆయనపై చల్లా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారంటు మండిపడ్డారు. చల్లమల కృష్ణారెడ్డి తన తీరు మార్చుకొని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ను చైతన్యపరిచి తగిన బుద్ధి చెబుతామన్నారు.