Congress
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని మోడీ వస్తున్నారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కూడా జరపకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళం వేసి జిల్లా పార్టీ ముందు పోలీసులు డీసీఎం వ్యాన్ పెట్టి ముందస్తు ఆరెస్ట్ చేశారని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బెజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. ఎక్కడ మమ్ములను నిలదీస్తారనో మమ్ములను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు మేము కొట్టినట్టు చేస్తాం నువ్వు ఏడ్చినట్టు చేయి అని కలిసి కట్టుగా ఈ దుర్మార్గానికి ఒడిగట్టాయని విమర్శించారు.
రూ.520 కోట్ల నిధులతో ప్రధాని శంకుస్థాపన చేయడానికి ప్రధాన మంత్రి స్థాయిలో ఉండి రావడమా ? అంటూ ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను మడికొండ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో పెట్టారన్నారు. హౌస్ అరెస్టుల తోటి మా గొంతులను నొక్కలేరు.
ప్రజాస్వామ్యవాదులందరు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని బిజెపి, బిఆర్ఎస్ కొత్త నాటకానికి పూనుకుంటున్నారని, పార్టీలు లోపాయి కారి ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతూ, ఉద్యమాలు చేస్తున్నట్టు నటిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని రాజేందర్ రెడ్డి అన్నారు.