COWIN DATA | కొవిన్ డేటా లీక్‌.. ప్రముఖుల వివరాలు టెలీగ్రాంలో ప్ర‌త్య‌క్షం

డేటా చౌర్యాన్ని దాచిపెట్టార‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు అలా జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌న్న ఎల‌క్ట్రానిక్స్ మంత్రి విధాత‌: కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కొత్త స‌మ‌స్యలో చిక్కుకుంది. కొవిన్ (CoWIN Data) యాప్ నుంచి కొవిడ్ 19 వ్యాక్సినేష‌న్ డేటా బేస్ లీక్ అయింద‌ని, దీనిని ప్ర‌భుత్వం దాచి పెట్టింద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా టీకా తీసుకున్న‌వారి వివ‌రాలు ఒక ప‌బ్లిక్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ఉన్నాయ‌ని తెలుస్తోంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న వారి పేర్లు, ఫోను […]

  • Publish Date - June 13, 2023 / 09:36 AM IST
  • డేటా చౌర్యాన్ని దాచిపెట్టార‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు
  • అలా జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌న్న ఎల‌క్ట్రానిక్స్ మంత్రి

విధాత‌: కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కొత్త స‌మ‌స్యలో చిక్కుకుంది. కొవిన్ (CoWIN Data) యాప్ నుంచి కొవిడ్ 19 వ్యాక్సినేష‌న్ డేటా బేస్ లీక్ అయింద‌ని, దీనిని ప్ర‌భుత్వం దాచి పెట్టింద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా టీకా తీసుకున్న‌వారి వివ‌రాలు ఒక ప‌బ్లిక్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

కొవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న వారి పేర్లు, ఫోను నంబ‌ర్లు, పుట్టిన తేదీలు, ఇంకా చాలా వివ‌రాలు టెలీగ్రాం యాప్‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయ‌ని కేర‌ళ న్యూస్ వెబ్‌సైట్ ద ఫోర్త్ పేర్కొంటూ ఒక క‌థ‌నం వెలువ‌రించింది. టెలీగ్రాంలో చాట్‌బాట్ ద్వారా ఈ స‌మాచారం ల‌భిస్తుండ‌గా.. దాన‌ని ఎవ‌రు రూపొందించార‌న్న‌ది తెలియ‌డంలేదు.

ఈ ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. డేటా చౌర్యం ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేసి వెంట‌నే నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ)ను కొవిన్ యాప్‌ను నిర్వ‌హిస్తున్న కేంద్ర వైద్య శాఖ ఆదేశించింది.

సోమ‌వారం ఈ ఆదేశాలు వెలువ‌డ‌గా.. సద‌రు టెలిగ్రాం బాట్‌లో ఫోన్ నంబ‌ర్ న‌మోదు చేయ‌డం ద్వారా కొవిన్ యాప్‌లో న‌మోదైన వివ‌రాల‌ను ఇస్తోంద‌ని ఎల‌క్ట్రానిక్స్ శాఖ స‌హాయ‌మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ సోమ‌వారం సాయంత్రం ట్వీట్ చేశారు. ఈ మేర‌కు సీఈఆర్‌టీ ద‌ర్యాప్తులో తేలింద‌ని వెల్ల‌డించారు. అయితే కొవిన్ యాప్ నుంచే ఈ డేటా చోరీ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిప‌రేశారు. ఇంత‌కు ముందే దొంగిలించిన డేటా నుంచే ఈ వివ‌రాలు బ‌య‌ట‌ప‌డి ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ వివ‌ర‌ణ‌పై నిపుణులు మండిప‌డ్డారు. ముంద‌స్తుగా జ‌రిగిన డేటా చౌర్యం అన్న మంత్రి.. దాని సోర్స్‌ను కూడా బ‌య‌ట‌పెట్టి ఉండాల్సింద‌ని విమ‌ర్శించారు. కొవిడ్ టీకా తీసుకున్న వారి వివ‌రాలు కొవిన్ యాప్‌లో త‌ప్ప ఎక్క‌డా న‌మోదు చేయ‌లేద‌ని వారు గుర్తుచేశారు. ‘ఇది ఎంత ఘోరం. మ‌న డిజిటల్ ఇన్‌ఫ్రా ఎంత బ‌ల‌హీనంగా ఉందో ఈ ఘ‌ట‌న రుజువు చేసింది’ అని సుప్రీంకోర్టు అడ్వ‌కేట్ సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణుడు ప‌వ‌న్ దుగ్గల్ వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు కొవిన్ యాప్ నుంచి డేటాను త‌స్క‌రించే అవ‌కాశ‌మే లేద‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వం త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది. వినియోగ‌దారుడు త‌న ఓటీపీని చెబితే త‌ప్ప ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని తెలిపింది. స‌ద‌రు బాట్ సైతం.. నేరుగా కొవిన్‌ను యాక్సెస్ చేయ‌ట్లేద‌ని సీఈఆర్‌టీ క‌నుగొన్న‌ట్లు నివేదిక‌లో పేర్కొంది. గ‌తంలోనూ కొవిన్‌పై ఆరోప‌ణ‌లు రాగా జ‌న‌వ‌రి 21, 2022న కేంద్ర‌ప్ర‌భుత్వం ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది.