కరీంనగర్ భూ కబ్జాదారులపై ఉక్కుపాదం

కరీంనగర్ పట్టణంతో సహా శివార్లలో గత కొంతకాలంగా యథేచ్ఛగా కొనసాగిన భూకబ్జాలపై పోలీసులు దృష్టి సారించారు.

♦ బీఆర్ఎస్ కార్పొరేటర్ తో సహా మరొకరి అరెస్ట్

♦ మాజీ మంత్రి ప్రధాన అనుచరుడి అరెస్ట్ తో

   భూ కబ్జాదారుల గుండెల్లో దడ

♦ నిందితుల పక్షాన నిలిచిన పోలీసులపైనా విచారణ

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ పట్టణంతో సహా శివార్లలో గత కొంతకాలంగా యథేచ్ఛగా కొనసాగిన భూకబ్జాలపై పోలీసులు దృష్టి సారించారు. భూ కబ్జాదారుల భరతం పట్టే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలి కరీంనగర్ పర్యటనలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూముల ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. బాధితులు ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఈనేపథ్యంలో బుధవారం భూకబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ కార్పొరేటర్ తో సహా మరొకరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.


గత ప్రభుత్వంలో పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన 12వ డివిజన్ కార్పొరేటర్ తోటరాములును పోలీసులు అరెస్ట్ చేయడం కరీంనగర్ లో సంచలనం సృష్టించింది. ఆయనతోపాటు చీటీ రామారావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మ శెట్టి శ్యామ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తన భూమి విషయంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకొని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భగత్ నగర్ కు చెందిన కొత్త రాజిరెడ్డి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షణ చేసినా, ఫలితం లేకపోవడంతో మీడియా ముందు ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువుపెట్టారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, నిజాయితీగా వ్యవహరించే అభిషేక్ మహంతి పోలీస్ కమిషనర్ గా ఉండడంతో రాజిరెడ్డి సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. సీపీ ఆదేశాలతో ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు తోటరాములు, చీటి రామారావు, నిమ్మ శెట్టి శ్యామ్ పై ఐపీసీ సెక్షన్ 447,427 ఆర్/డబ్ల్యు 34 కింద కేసు నమోదు చేశారు.


భూ దందాలకు సంబంధించి గతంలో వచ్చిన ఫిర్యాదులు, వాటిపై జరిగిన విచారణ, బాధితులకు న్యాయం జరిగిందా అన్న విషయాలను పోలీసులు ప్రస్తుతం తవ్వితీస్తున్నారు. నిందితుల పక్షాన నిలిచిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్ తో ఇక్కడి భూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నగరంలో జరిగిన భూదందాలపై ప్రస్తుత సీపీ ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంతో, త్వరలో మరిన్ని అరెస్టులు తప్పవన్న చర్చ నడుస్తోంది.