CSDS-Lokniti Survey | మోదీ ఐదేళ్లలో అవినీతి పెరిగింది- సీఎస్డీఎస్-లోకనీతి సర్వే

న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికలకు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి అనే మూడు అంశాలు ప్రధాన ఎజెండాగా ప్రజలు భావిస్తున్నట్లు సీఎస్డీఎస్-లోకనీతి(CSDS-Lokniti) నిర్వహించిన సర్వే వెల్లడించింది. మోదీ ప్రధానిగా రెండోసారి అధికారం చేపట్టిన ఈ ఐదేళ్లలో దేశంలో అవినీతి బాగా పెరిగిపోయిందని సర్వేలో పాల్గొన్న 55 శాతం మంది స్పష్టం చేశారు.
ప్రస్తుత ఎన్నికల్లో నిరుద్యోగం, ధరల పెరుగుదల అధికార భారతీయ జనతా పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడతాయని, అభివృద్ధి కంటే అవినీతి పెరుగుదల అంశం ప్రతికూలంగా మారే అవకాశం ఉందని కూడా ఈ సర్వేలో స్పష్టమైంది.
ఇక యువతలో నిరుద్యోగం – రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో కీలక సమస్యగా మారింది – రాను రాను ఇదే ప్రధాన సమస్యగా అధికార పార్టీలకు తయారు కానుంది. భారతదేశంలోని యువతను ఈ నిరుద్యోగ సమస్య గణనీయంగా ప్రభావితం చేస్తుందని కూడా సర్వేలో వెల్లడైంది. ఇదే విషయాన్ని ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక కూడా స్పష్టం చేసింది. 2022 అంచనా ప్రకారం మొత్తం నిరుద్యోగుల శాతంలో నిరుద్యోగ యువత వాటా 82.9 శాతం ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
గత ఐదేళ్లతో పోలిస్తే ఉద్యోగాలు పొందడం చాలా కష్టంగా మారిందని దాదాపు ఐదింట మూడొంతుల మంది భావిస్తున్నారని అధ్యయనంలో తేలింది. కేవలం 12 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందడం సులభం అని చెప్పారు. గ్రామీణ ఓటర్లలో నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి అధికార పార్టీ నాయకులను ప్రశ్నించే అవకాశం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ‘అభివృద్ధి’ అనేది కీలకమైన అంశంగా మారిందని, గణనీయమైన అభివృద్ధి జరిగిందని చెబుతున్నా, 10 మందిలో ఇద్దరు ఓటర్లు గత ఐదేళ్లలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో ‘ధనవంతుల కోసమే’ అభివృద్ధి జరిగిందని 32 శాతం మంది ఓటర్లు భావిస్తున్నారని ప్రీ-పోల్ సర్వేలో తేలిందని సర్వే నివేదిక పేర్కొంది.
మోడీ చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సందేహాలు కూడా ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. కేవలం 8 శాతం మంది మాత్రమే మోడీ అభివృద్ధిని, రామమందిర నిర్మాణాన్ని మెచ్చుకుంటున్నారని వెల్లడైంది. గత ఐదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో అవినీతి పెరిగిపోయిందనే భావన మెజారిటీ ఓటర్లలో కనిపిస్తోంది. దీనికి తోడు కనీస మద్దతు ధర హామీపై రైతుల నిరసనలు, ధర్నాలు, పోరాటాలు కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిధ్వనిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.