Power Supplay: తెలంగాణలో కరెంట్ పీక్ డిమాండ్.. 16 వేల మెగావాట్లు: మంత్రి KTR
నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంట్ పోతే వార్త తండాలను పంచాయతీలుగా మార్చడం మా ఘనత గిరిజనుల రిజర్వేషన్ 6 నుండి 10 శాతానికి పెంచాం సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి తారక రామారావు విధాత బ్యూరో, కరీంనగర్: సమైక్య రాష్ట్రంలో కరెంట్ పీక్ డిమాండ్ 13,117 మెగావాట్లు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ డిమాండ్ 16వేల మెగావాట్లు దాటిందని మంత్రి తారక రామారావు అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం […]

- నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంట్ పోతే వార్త
- తండాలను పంచాయతీలుగా మార్చడం మా ఘనత
- గిరిజనుల రిజర్వేషన్ 6 నుండి 10 శాతానికి పెంచాం
- సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి తారక రామారావు
విధాత బ్యూరో, కరీంనగర్: సమైక్య రాష్ట్రంలో కరెంట్ పీక్ డిమాండ్ 13,117 మెగావాట్లు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ డిమాండ్ 16వేల మెగావాట్లు దాటిందని మంత్రి తారక రామారావు అన్నారు.
సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ధూమాల గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదే మండల పరిధిలోని బుగ్గ రాజేశ్వర తండాలో 20 లక్షల ఖర్చుతో నిర్మించిన పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు, వ్యవసాయ పారిశ్రామిక అవసరాలకు నిరంతర విద్యుత్ అందే లక్ష్యంతో ఈ రంగంపై పదివేల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
సమైక్య రాష్ట్రంలో కరెంటు ఉంటే వార్త, తెలంగాణలో కరెంటు పోతే వార్త… విద్యుత్ రంగంలో గణనీయమైన ప్రగతికి ఇది నిదర్శనం అన్నారు. 50 వేల కోట్లు ఖర్చు చేసి రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో రైతులు తాము తెచ్చిన అప్పులకు కిస్తులు కట్టలేని పరిస్థితులలో వారి దర్వాజాలు గుంజుకుపోయిన చరిత్ర కళ్ళ ముందు ఉందన్నారు. రైతు అప్పుల బారిన పడవద్దు అనే కారణంతో తాము రెండు పంటలకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.
వ్యవసాయ రంగంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ కారణంగా, తెలంగాణ ఏర్పడే నాటికి ఇప్పటికి భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పారు. పేద, ధనిక అనే అంతరాలు లేని సమాజం కోసం పాటు పడుతున్నామన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ఆశయం అన్నారు.
తండాలను పంచాయతీలుగా మార్చాలన్న, గిరిజనుల సుదీర్ఘకాల డిమాండ్ నెరవేర్చామన్నారు.
గిరిజనులకున్న ఆరు శాతం రిజర్వేషన్లు 10 శాతానికి పెంచామని, 3000 మంది గిరిజనులు సర్పంచులుగా, 20,000 మంది వార్డు సభ్యులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.