మిజ్‌గాం ఎఫెక్ట్.. హైద‌రాబాద్ స‌హా ప‌లు జిల్లాల్లో వ‌ర్షం

మిజ్‌గాం తుపాను ప్ర‌భావంతో రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి

మిజ్‌గాం ఎఫెక్ట్.. హైద‌రాబాద్ స‌హా ప‌లు జిల్లాల్లో వ‌ర్షం

హైద‌రాబాద్: మిజ్‌గాం తుపాను ప్ర‌భావంతో రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ ఉద‌యం మోస్త‌రు వ‌ర్షం కురిసింది. ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లోనూ వ‌ర్షం కురుస్తోంది.


హైద‌రాబాద్‌లోని మియాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, మూసాపేట‌, ఎస్సార్ న‌గ‌ర్, స‌న‌త్ న‌గ‌ర్, అమీర్‌పేట‌, ఖైర‌తాబాద్, నాంప‌ల్లి, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఎల్‌బీ న‌గ‌ర్, హ‌య‌త్‌న‌గ‌ర్‌, అబ్దుల్లాపూర్‌మెట్ తో పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. దీంతో న‌గ‌రంలో చాలా చోట్ల రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని భ‌ద్రాచ‌లం, అశ్వారావుపేట‌, నేల‌కొండ‌ప‌ల్లి, ఇల్లందు, అన్న‌పురెడ్డిప‌ల్లి, క‌ల్లూరు, ఆళ్ల‌ప‌ల్లి, స‌త్తుప‌ల్లిలో వ‌ర్షం కురుస్తోంది. ఇల్లందు స‌మీపంలోని సింగ‌రేణి ఉప‌రిత‌ల గ‌నిలో బొగ్గు ఉత్ప‌త్తి నిలిచిపోయింది.


తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో ఒంటి గంట వ‌ర‌కు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. హైద‌రాబాద్, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, జ‌న‌గాం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్, నాగ‌ర్‌క‌ర్నూల్, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి, సూర్యాపేట‌, వ‌న‌ప‌ర్తి, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, యాదాద్రి జిల్లాల్లో వ‌ర్షం కొన‌సాగ‌నుంద‌ని తెలిపింది.


తుపాను ప్ర‌భావంతో ఇప్ప‌టికే ఏపీలోని తీర‌ప్రాంత జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లుచోట్ల గంట‌కు 90 కిలోమీట‌ర్ల‌కు పైగా వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగింది. గంట‌కు 7 కిలోమీట‌ర్ల వేగంతో మిజ్‌గాం తుపాను ముందుకు కదులుతోంది.