విధాత బ్యూరో, కరీంనగర్: కూలి పని చేస్తూ కుటుంబానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటున్న తమ తండ్రిని గుండెపోటు రూపంలో మృత్యువు కబలిస్తే.. నలుగురు కూతుర్లు గుండెలవిసేలా విలపించారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని కుమారులు లేని లోటు తీర్చేందుకు స్థితి వరకు పాడే మోసి తండ్రికి తలకొరివి పెట్టారు.
ఈ హృదయ విధారక ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మడక గ్రామానికి చెందిన మేకల సదయ్య(48) దినసరి కూలి. ఆయనకు భార్య వజ్రమ్మ, నలుగురు కూతుర్లు. బుధవారం స్నేహితులతో సరదాగా గడిపిన సదయ్యను గుండెపోటు రూపంలో మృత్యువు వెంటాడింది.
భార్య, భర్తలు ఇరువురు కూలి పని చేస్తున్నప్పటికీ తమ నలుగురు కూతుళ్లు స్పందన, అనూష, మేఘన,ప్రగతి ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించి అందుకు ప్రోత్సహించారు. సదయ్య నలుగురు కుమార్తెల్లో ఇద్దరు కరీంనగర్లో ఇంటర్, మరో ఇద్దరు హైదరాబాద్ లో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తున్నారు.
తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన గ్రామానికి చేరుకున్న వీరు ఇకపై తమకు దిక్కెవ్వరంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమలోని దుఃఖాన్ని దిగమింగుకొని తండ్రి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.
ముగ్గురు కూతుర్లు స్మశాన వాటిక వరకు తమ తండ్రి పాడెను మోసుకుంటూ వెళ్ళగా, పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. అంచుక్రియలకు హాజరైన స్థానికులు తండ్రికి కూతుర్లు తలకొరివి పెట్టే దృశ్యాన్ని చూసి తట్టుకోలేక పోయారు.