రుణ పంపిణీ బ్యాంకర్ల సామాజిక బాధ్యత
రుణాల పంపిణీని బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలకు, రైతులకు విస్తృత రుణ పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు

- వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత
- స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
- వ్యవసాయ రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
విధాత, హైదరాబాద్: రుణాల పంపిణీని బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలకు, రైతులకు విస్తృత రుణ పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు. పట్టు గూళ్ల పెంపకం రైతులకు 1కోటి 83లక్షల 41,000 రూపాయల ప్రోత్సాహక ఇన్సెంటివ్‌ను అందచేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వ్యవసాయం, హౌసింగ్, విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు.
రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదన్నారు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వండని, రానున్న ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇస్తామని, మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయం మా ప్రభుత్వం ప్రాధాన్యత అంశమని, రుణాలు ఇచ్చే విషయంలో రైతుల పట్ల నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శిస్తే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారని, ఫలితంగా ఆత్మహత్యలకు దారితీస్తుందన్నారు.
ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న సమయంలో విద్య రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభం అయ్యాయని, 20 ఏళ్లు అయినా ఆ రుణాల జారీలో ప్రగతి కనిపించడం లేదని చెప్పారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి సంపదను కింది వర్గాలకు పంపిణీ చేసిందని, తెలంగాణ ధనిక రాష్ట్రంగా నిలబడాలంటే బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించాలి, సంపదను సృష్టించాలని , రాష్ట్రంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని తెలిపారు.
వ్యవసాయ రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని : మంత్రి తుమ్మల
రుణాల మంజూరీలో బ్యాంకర్లు వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చి వార్షిక రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బ్యాంకర్లకు సూచించారు. రైతు ట్రాక్టర్లను తీసుకుంటే పొలాన్ని తాకట్టు పెట్టుకొని ఇస్తున్నారని, కట్టకుంటే భూమిపైకి వస్తున్నారని, అదే వేల కోట్లు అప్పులు ఇచ్చిన వ్యాపారుల నుంచి రుణాలను ఎందుకు రికవరీ చేయడం లేదని తుమ్మల ప్రశ్నించారు. బడా వ్యాపారులకు ఏమి గ్యారెంటీ పెట్టుకొని రుణాలు ఇస్తున్నారని నిలదీశారు. వారి నుంచి రుణాలను రికవరీ చేయడానికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటని, బడా వ్యాపారుల పట్ల ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు పాల ఉత్పత్తి లేదని, పాడి పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకు వచ్చే రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థ నిబద్ధతగా ఉండాలని కలుషితం కారాదన్నారు. పామాయిల్ పంటను అన్ని జిల్లాలకు విస్తరించామని.. దేశ సంపద రైతులేనని, దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయమే ప్రధానమని స్పష్టం చేశారు. దేశంలో వ్యవసాయం తక్కువైతే ఆహారం కొరత ఏర్పడుతుందని. వ్యవస్థను విచ్చిన్నం చేస్తే సమాజాన్ని విచ్చిన్నం చేసినట్టే అవుతుందన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో ప్రజలకు ప్రాధాన్యత ఉన్న పథకాలను గుర్తించి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో విచ్చిన్నమైన వ్యవస్థలను సరిచేసి ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చాలన్న లక్ష్యంతో అంకితభావంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించాలని కోరారు. గత పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు.