రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ఇలానే కొనసాగిస్తాం : మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో నెలకొన్న ఆర్థిక, సామాజిక అసమానతల నిర్మూలన లక్ష్యంగా వాస్తవిక అంశాల ఆధారంగా తమ ప్రజా ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

- అసమానతల నిర్మూలనే లక్ష్యం
- హామీల మేరకే వాస్తవాలతో ప్రతిపాదనలు
- పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు
- మళ్లీ అప్పులు చేయక తప్పడం లేదు
- ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకే రుణాలు
- బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో
- డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి
- ప్రధాని ఫోటో పెడుతాం..
- నిధులిప్పించాలని బీజేపీకి చురక
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో నెలకొన్న ఆర్థిక, సామాజిక అసమానతల నిర్మూలన లక్ష్యంగా వాస్తవిక అంశాల ఆధారంగా తమ ప్రజా ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన గురువారం సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. గతంలో ఏటా 20 శాతం బడ్జెట్ ప్రతిపాదనలను పెంచుకుంటు పోయారని, కేటాయింపుల మేరకు నిధులు అందని పరిస్థితి ఉండేదని తెలిపారు. ఆదాయం లేకున్నా బడ్జెట్ పెంచి బీసీ, దళితులకు ఇస్తామని బంధు సహాయాలు, రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
అయితే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పథకాలకు, హామీలకు నిధులను కేటాయిస్తూ 2.75లక్షల కోట్లతో వాస్తవ బడ్జెట్ రూపొందించిందని భట్టి విక్రమార్క చెప్పారు. ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో రూ.53వేల కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయక తప్పట్లేదని తెలిపారు. అప్పులు చేయలేకపోతే జీతాలు ఇవ్వని పరిస్థితిని గత ప్రభుత్వం తెచ్చిపెట్టిందని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు.
రైతుభరోసా కోసం బడ్జెట్లో రూ.15,075 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.7,740 కోట్లు కేటాయించామని, నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తామని భట్టి విక్రమార్క వివరించారు. గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్తు కోసం రూ.2418 కోట్లు, రూ.500కు గ్యాస్ సిలిండర్ కోసం రూ.723 కోట్లు, సాంఘిక సంక్షేమం కోసం రూ.5,815 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం రూ.2,800 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ కోసం రూ.40వేల కోట్లు కేటాయించామని తెలిపారు. బడ్జెట్, బడ్జెట్ యేతర రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందన్నారు.
నియామకాల జాతర కొనసాగుతుంది
పదేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల కోసం యువత ఎదురు చూశారని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, అదనపు సిబ్బందిని ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీకి రూ.40కోట్లు మంజూరు చేశామని చెప్పారు. గ్రూప్-1లో 503 పోస్టులకు ఆదనంగా 61 పోస్టులు మంజూరు చేశామని గుర్తు చేశారు. పోలీసు నియామక సంస్థ ద్వారా 13,444 పోస్టుల భర్తీ పూర్తి చేశామన్నారు.
6900 నర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామని, సింగరేణిలో 412మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఈ ఉద్యోగాల జాతర కొనసాగుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మరో 2వేల మందికి సోషల్ వెల్ఫేర్ శాఖలో ఉద్యోగాలిస్తామన్నారు. యువత కలల సాకారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. 500రూపాయలకే సిలిండ్, మహాలక్ష్మి పథకం అమలుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
ప్రధాని ఫోటో పెడుతాం.. నిధులిప్పించండి
కేంద్ర పథకాలకు సంబంధించి ప్రధాని ఫోటో పెట్టేందుకు తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని భట్టి విక్రమార్క అన్నారు. అదేసమయంలో రాష్ట్రాల నుంచి వచ్చే నిధులతో కేంద్రం అమలు చేసే పథకాలకు కూడా రాష్ట్రాల సీఎంలు ఫోటోలు పెడితే బాగుంటుందని బీజేపీ సభ్యులకు చురకలేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని సూచించగా స్పందించిన భట్టి.. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్, నిధులు తెచ్చుకోవడానికి తమ ప్రభుత్వంలో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చేలా కేంద్రంలోని కేంద్రానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఒక మాట చెప్పి సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చే స్కీమ్‌లకు ప్రధాన మంత్రి ఫోటో పెట్టేందుకు మాకు ఎలాంటి అభ్యతంరం లేదన్నారు.