Maha Shivaratri | వైభవంగా మహా శివరాత్రి వేడుకలు.. కిటలాడుతున్న శివాలయాలు
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలు శివన్నామస్మరణతో మార్మోగుతున్నాయి

Maha Shivaratri | తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలు శివన్నామస్మరణతో మార్మోగుతున్నాయి. వేకువ జాము నుంచే దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూలైన్లలో బారులు తీరి భోళాశంకరుడికి అభిషేకాలు నిర్వహించుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పలు ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యే పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దేవాలయాలను ముస్తాబుచేశారు. అనేక ఆలయాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి.
శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ప్రత్యేక ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ఏపీలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి ఆలయం, అమరావతి పుణ్యక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. ఓం నమశ్శివాయ అంటూ భక్తులు కైలాసనాథుడికి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం కిటకిట లాడుతున్నది. ఉదయం మూడు గంటల నుంచే స్వామి వారి సేవలను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో బారులు తీరి పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారలను దర్శించుకుంటున్నారు.
కీసరకూ భక్తుల తాకిడి పెరిగింది. కొమరవెల్లి మల్లన్న ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు. పాత నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్ ఛాయాసోమేశ్వరాలయం, పిల్లలమర్రి, వాడపల్లి శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తుల సందడి నెలకొంది. హనుమకొండ వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.