Guru pournami | గురుపౌర్ణమి విశిష్ఠత ఏమిటి.. గురు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..?
Guru pournami : దేశంలో హిందువులకు ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. అలాంటి పండుగల్లో గురు పౌర్ణమి పండుగ ఒకటి. ఈ పండుగను ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ప్రతి ఏటా హిందూ సంప్రదాయం ప్రకారం.. ఈ పండుగ ఆషాఢ పౌర్ణమి తిథి రోజున వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిథి రెండు రోజులు.. అంటే మిగులు తగులుగా వచ్చింది.

Guru pournami : దేశంలో హిందువులకు ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. అలాంటి పండుగల్లో గురు పౌర్ణమి పండుగ ఒకటి. ఈ పండుగను ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ప్రతి ఏటా హిందూ సంప్రదాయం ప్రకారం.. ఈ పండుగ ఆషాఢ పౌర్ణమి తిథి రోజున వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిథి రెండు రోజులు.. అంటే మిగులు తగులుగా వచ్చింది.
ఈ పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం సముయంలో ఉన్న తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఆషాఢ పౌర్ణమి తిథి సూర్యోదయం జూలై 21న ఉదయం 05:37 గంటలకు అవుతుంది. కాబట్టి జూలై 21న గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి..? గురు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గురు పౌర్ణమి ప్రత్యేకత
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ గురు పౌర్ణమి పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ. ఎందుకంటే సనాతన హైందవ ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కింది. పైగా ఈ సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. కానీ అందులో కొంత మాత్రమే తల్లిదండ్రుల వద్ద నేర్చుకోగలం. మిగిలినదంత గురువు దగ్గరే నేర్చుకోవాలి. ఓనమాలు దిద్దే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే ఈ ప్రయాణంలో గురువు పాత్ర చాలా కీలకమైనది. అందుకే గురువును.. ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః’ అని అంటారు.
గురు అంటే.. సంస్కృతంలో ‘గు’ అనే శబ్దానికి చీకటి అని అర్థం. ‘రు’ అంటే నాశనం చేసే తేజస్సు అని అర్ధం. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువు అని అర్థం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెప్తూ.. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానసంపన్నుడు, గుణసంపన్నుడుగా గురువు ఉంటాడు. ముఖ్యంగా చదువు, జ్ఞానంతోపాటు ఏ దారిలో నడవాలి, ఏ గమ్యం వైపు నడవాలనే విషయంలో గురువే మార్గదర్శిగా నిలుస్తాడు. ఈ గురు పౌర్ణమినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
పురణాల ప్రకారం గురు పూర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించాడట. అందుకే ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమి అని కూడా అంటారు. ఈ వ్యాస మహర్షికి పెద్ద చరిత్ర ఉంది. ఆయన జన్మదినాన్ని ఒక మహా పర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకే ఆ రోజున భగవంతునితో సమానమైన గురువులను నమస్కరించి పూజించుకోవాలి.
గురు అనుగ్రహం ఎలా పొందాలి..?
గురు పూర్ణిమ నాడు గురు అనుగ్రహం పొందలంటే.. ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్లి ఇంటికి ఆహ్వానించాలి. వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు వారికి ఆహారం అందించి, తగిన బహుమతులు ఇవ్వాలి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ఏ రంగంలో ఉన్నవారైనా పురోగతిని పొందుతారు. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని నమ్మకం.
అదేవిధంగా గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు, పసుపు, ఇత్తడి పాత్రలు, బెల్లం, నెయ్యి, పసుపు బియ్యం మొదలైన వాటిని దానం చేయండి. ఈ రోజున దేవ గురువైన బృహస్పతిని ఆరాధించడం వలన సంతోషం, సౌభాగ్యం ఐశ్వరం కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.