MP Kanimozhi
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించినది కాదని, అది మహిళల పట్ల పక్షపాతాన్ని, అన్యాయాన్ని తొలగించేదని డీఎంకే సభ్యురాలు కనిమొళి అన్నారు. సమాన గౌరవాన్ని మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. నారీ శక్తి వందన్ అభినియంపై చర్చలో ఆమె మాట్లాడుతూ.. బిల్లులో పేర్కొన్న ‘పునర్విభజన తర్వాత’ అనే అంశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో విపరీతమైన జాప్యం అవుతుందని అన్నారు.
‘ఈ బిల్లు అమలు కోసం మేం ఎన్నాళ్లు ఎదురుచూడాలి? రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనే దీనిని సులభంగానే అమలు చేయవచ్చు. ఇది కేవలం రిజర్వేషన్లు కల్పించేది మాత్రమే కాదు.. ఇది మహిళల పట్ల వివక్షను, అన్యాయాన్ని తొలగించేదిగా అర్థం చేసుకోవాలి’ అని కనిమొళి చెప్పారు. ఉత్తుత్తి రాజకీయాలు వదిలి.. ఆలోచనా రాజకీయాలకు మళ్లాల్సిన అవసరం ఉన్నదని ఆమె నొక్కి చెప్పారు. ‘ఈ బిల్లును నారీ శక్తి వందన్ అధినియం అని పిలుస్తున్నారు.
#WATCH | Women’s Reservation Bill | DMK MP Kanimozhi says, “I myself have raised this issue of bringing the Reservation Bill many times in Parliament. To many of my starred and unstarred questions, the Govt’s reply was very consistent. They said that they have to involve all… pic.twitter.com/8gAJzAbopa
— ANI (@ANI) September 20, 2023
మాకు వందనాలు చేయడం మానండి. మీ వందనాలు మాకు అవసరం లేదు. మమ్మల్ని పీఠాలపైకి ఎక్కించాలని మేం కోరుకోవడం లేదు. మమ్మల్ని పూజించాలనీ అనుకోవడం లేదు. సమాన గౌరవాన్ని కోరుకుంటున్నాం అంతే’ అని ఆమె చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను శక్తిమంతమైన నాయకురాలిగా ఆమోదించడానికి తనకేమీ శషభిషలు లేవని కనిమొళి స్పష్టం చేశారు.
కాగా.. తాను అనేక పర్యాయాలు ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించానని తెలిపారు. ప్రతి సారీ ప్రభుత్వం.. ఈ బిల్లు తేవడానికి ముందు ఏకాభిప్రాయం సాధించాల్సి ఉన్నదని, అందరితో చర్చించాల్సి ఉన్నదనే సమాధానాన్నే ఇస్తూ వచ్చిందన్న కనిమొళి.. ఇప్పుడు బిల్లు తేవడానికి ముందు ఎవరితో చర్చించారు? ఎలాంటి ఏకాభిప్రాయాం సాధించారు? అని నిలదీశారు. అత్యంత గోప్యంగా ఈ బిల్లు తెచ్చారని విమర్శించారు. అసలు ఈ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారో కూడా తమకు తెలియలేదని చెప్పారు.