BRS | ‘చల్లా’ వద్దే వద్దు.. పట్టువీడని పరకాల అసమ్మతి వర్గ నేతలు
BRS | చల్లాపై గరం గరం ఆయన అభ్యర్థిత్వం వద్దే వద్దు.. పట్టువీడని అసమ్మతి వర్గ నేతలు పోటీ చేస్తే ఓటమి తప్పదంటూ హెచ్చరిక పరకాల బీఆర్ఎస్ లో రాజకీయ వేడి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆపార్టీలో అసమ్మతిని రగిలిస్తోంది. చల్లా ధర్మారెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినప్పటికీ, అసమ్మతివర్గం మాత్రం సమ్మతించడం లేదు. ఆయన్ను మార్చాలంటూ పట్టువీడకుండా ప్రయత్నిస్తున్నారు. ఆఖరి క్షణం వరకు చల్లా వ్యతిరేకులు వెనక్కుతగ్గే […]

BRS |
- చల్లాపై గరం గరం
- ఆయన అభ్యర్థిత్వం వద్దే వద్దు..
- పట్టువీడని అసమ్మతి వర్గ నేతలు
- పోటీ చేస్తే ఓటమి తప్పదంటూ హెచ్చరిక
- పరకాల బీఆర్ఎస్ లో రాజకీయ వేడి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆపార్టీలో అసమ్మతిని రగిలిస్తోంది. చల్లా ధర్మారెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినప్పటికీ, అసమ్మతివర్గం మాత్రం సమ్మతించడం లేదు. ఆయన్ను మార్చాలంటూ పట్టువీడకుండా ప్రయత్నిస్తున్నారు. ఆఖరి క్షణం వరకు చల్లా వ్యతిరేకులు వెనక్కుతగ్గే అవకాశం కన్పించడంలేదు.
పరకాల నియోజకవర్గంలో చల్లా వర్గానికి, తెలంగాణ ఉద్యమకారుల మధ్య విభేదాలు తొలి నుంచి కొనసాగుతున్నాయి. చల్లా తీరు పైన మొదటి నుంచి నిరసనల గొంతెత్తుతున్నారు. చల్లా ధర్మారెడ్డిని మార్చాలనే అస్త్రంగా సొంత పార్టీలో రాజకీయ వేడి రగులుతోంది. ఉద్యమకారులు వర్సెస్ బీటీ బ్యాచ్ అంటూ ప్రారంభమైన విభేదాలు, పరస్పర దూషణలు, సవాళ్ళతో బజారునపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరకాల గులాబీ రాజకీయాల్లో నెలకొన్నఈ కొత్త చిచ్చు తగ్గడం లేదు.
చల్లాను మార్చాల్సిందే..
పరకాల అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డిని ప్రకటించినా, మార్చాల్సిందేనంటూ చల్లా వ్యతిరేకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు చల్లాకు వ్యతిరేకంగా బహిరంగ సమావేశాలు నిర్వహించారు. తాజాగా మంగళవారం పరకాల కేంద్రంలో అసమ్మతివాదులు సమావేశం నిర్వహించారు. చల్లాను మార్చకుంటే ఈ నియోజకవర్గంలో ఓటమి తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
భూ కబ్జాలు, అవినీతి, బంధుప్రీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా చల్లా ఉన్నందున తీవ్ర ప్రజావ్యతిరేకత నెలకొందని విమర్శిస్తున్నారు. పార్టీలో నాయకులు, కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. మరోసారి సర్వే నిర్వహించైనా చల్లాను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను చిన్నచూపు చూస్తూ, ప్రశ్నిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండి పడుతున్నారు. ఇటీవల తెలంగాణ ఉద్యమకారులు సందెల సునిల్, గజ్జి విష్ణులను బహిష్కరించడంతో రగిలిపోతున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా స్థానంలో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన రుణ విమోచన సమితి రాష్ట్ర చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పెద్ద సంఖ్యలో చల్లా వ్యతిరేకులు, ఆరెకుల సంఘం ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సందేల సునిల్, గుర్రం రఘు, గజ్జి విష్ణు, కౌడగాని శంకర్ రావు, కొంగ సురేందర్, బాబుమియా, ఆర కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్, కార్యదర్శి హింగె శివాజీ, అంకతి రవి, మోటె చిరంజీవి ప్రసంగించారు.
ఆరని విభేదాలు
పరకాల నియోజకవర్గంలో తొలినుంచి ఉద్యమకారులు, బీటీ బ్యాచ్ మధ్య విభేదాలు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ముందే ఈ సమస్యపై ఉద్యమకారులు గొంతు విప్పారు. ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వైయస్సార్సీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే కొండా సురేఖ రాజీనామాతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కొండా సురేఖ పై టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ములుగురు బిక్షపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలంగాణ వచ్చేనాటికి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బిక్షపతిని కాదని న్యాయవాది ముద్దసాని సహోదరు రెడ్డికి పరకాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సహోదరు రెడ్డి ఓడిపోయి, టీడీపీ నుంచి పోటీ చేసిన చల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం చల్లా ధర్మారెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ధర్మారెడ్డి గెలుపొందారు. 2014లో ధర్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరినప్పటినుంచి తమను పట్టించుకోవడంలేదని పాత టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
బహిరంగ సమావేశాలు నిర్వహించి ధర్మారెడ్డి తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ దఫా కూడా ఉద్యమకారులకు పరకాల నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుందని గొంతు విప్పారు. ఉద్యమకారులు మరింత ఆందోళనకులోనై ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పరకాలలో తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితి ఇలాగే ఉంటే ధర్మారెడ్డికి తగిన గుణపాఠం చెబుదామని హెచ్చరిస్తున్నారు. సొంత పార్టీలోనే పాత, కొత్తల మధ్య విభేదాలు తలెత్తడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని చర్చ సాగుతోంది. అభ్యర్థిగా ప్రకటించిన ఈ సమయంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోవడం చల్లా ధర్మారెడ్డికి తీవ్ర సమస్య తెచ్చిపెడుతోంది.