తెలంగాణ, ఏపీలో ఒకే రోజు పోలింగ్‌తో ఎవరికి లాభం?
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఒకే రోజు పోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

విధాత: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఒకే రోజు పోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో ఈ రెండు రాష్ట్రాలలో ఒకే విడత పోలింగ్ జరిగితే లాభం ఎవరికి, నష్టం ఎవరికి అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాలకు నాలుగవ విడతలో 2004 మే 13న పోలింగ్ జరుగుతుంది. ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాలలో ఒకే విడత పోలింగ్‌పై చర్చ జరుగుతోంది.
గతంలో తెలంగాణ, ఏపీలకు రెండు విడతలుగా పోలింగ్ జరిగేది. తెలంగాణ మొత్తం ఒక విడతలో, ఏపీ మొత్తం మరో విడతలో పోలింగ్ జరిగేది. దీంతో ఏపీ నుంచి హైదరాబాద్ చుట్టు పక్కల సెటిల్ అయిన వాళ్లు తెలంగాణ, ఏపీ రెండు చోట్ల ఓటు వేసేవారన్న చర్చ కూడా ఉంది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొనసాగినట్లు చర్చ జరుగుతున్నది.
వాస్తవంగా ఓటర్ ఐడీ కార్డుకు ఆధార్ అనుసంధానం చేస్తే డూప్లికేషన్ లేకుండా పోయేది.. కానీ ఆధార్ అనుసంధానం లేక పోవడంతో రెండు, మూడు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్న వాళ్లను ఎన్నికల కమిషన్ గుర్తించ లేక పోతున్నది. దీంతో అనేక మంది తాము పని చేసే చోట, తమ సొంత గ్రామం వద్ద ఇలా రెండు చోట్ల ఓటర్‌గా నమోదు చేసుకుంటున్నారు. ఇలా ఓ టరుగా నమోదు చేసుకున్న చాలా మంది సెటిలర్లు రెండు విడతలుగా పోలింగ్ జరగడంతో రెండు చోట్ల ఓట్లు వేసేవారన్న సందేహాలున్నాయి.
ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి నగరంతోపాటు శివారు నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో సెటిల్ అయ్యారు. ఇలా జీహెచ్ ఎంసీ పరిధిలోని 25 అసెంబ్లీ నియోజక వర్గాలలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో వీరి పట్టు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్లు చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రభావితం చూపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా సెటిలర్లు ఓటు వేయక పోవడమేనన్న చర్చ రాజకీయ వర్గాలో జరుగుతోంది. హైదరాబాద్‌లో సెటిల్ అయిన వాళ్లలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఓటు వేయడానికి సొంత ఊర్లకు వెళ్లారని, ఆంధ్రా సెటిలర్లు ఇక్కడే ఓటు వేశారని, అందుకే సెటిలర్లు ఎక్కువగా బీఆరెస్‌కు ఓట్లు వేయడంతో కాంగ్రెస్ ఓడిందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది.
ఈ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండడంతో ఆంధ్రా సెటిలర్లు తమకు రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడకే వెళతారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో ఆంధ్రాకు చెందిన కమ్మ, కాపు సెటిలర్లు ఎక్కుడా టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి గెలుపు కోసం అక్కడకు వెళ్లి ఓట్లు వేస్తారని, వారికి చంద్రబాబు సీఎం కావడం మొదటి ప్రాధాన్యతగా ఉంటుందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేఫకులు వ్యక్తం చేస్తున్నారు.
రాలయసీమ ప్రాంతానికి చెందిన రెడ్లు జగన్ కోసం అక్కడకు వెళ్ల ఓట్లు వేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో మొదటి సారిగా తెలంగాణలో ఇక్కడి ప్రజలే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆంధ్రా సెటిలర్లు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్లు లేకుండా కేవలం హైదరాబాద్ ప్రజలు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకుంటే ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది? అన్న ఆసక్తి కరమైన చర్చ సర్వత్రా జరుగుతోంది.