ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన కుట్రదారు కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే

-
- కీలక సూత్రధారీ ఆయనే
- పంజాబ్, గోవా ఎన్నికల్లో నిధుల ఖర్చు
- కవితను కేజ్రీవాల్ నేరుగా కలిశారు
- రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ వాదనలు
- పది రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన కుట్రదారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపించింది. ఆయన కవితను కూడా కలిశారని పేర్కొంది. కవిత అందించిన 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఆరోపించింది. ఆయనను తమకు పదిరోజులపాటు విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో పదిరోజుల కస్టడీకి అనుమతిచ్చింది.
గురువారం రాత్రి (21.3.2024) అరెస్టు చేసిన కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం (22.3.2024) ప్రవేశపెట్టారు. ఈ నేరంలో ఆయన భాగస్వామిగా ఉన్నారని, ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో నేరుగా జోక్యం చేసుకున్నారని ఆరోపించింది. ఆయనను విచారణ నిమిత్తం పది రోజులపాటు ఈడీ కస్టడీకి ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టును కోరారు. ముడుపులు తీసుకునేందుకు వీలు కల్పించేలా ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించారని పేర్కొన్నారు.
సౌత్ గ్రూప్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య దళారిగా విజయ్‌నాయర్ వ్యవహరించారని తెలిపింది. విజయ్‌నాయర్ ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి చేరువలోనే ఉంటున్నారని, లిక్కర్ వ్యాపారులకు సానుకూలంగా పాలసీని రూపొందించేందుకు ముడుపులు డిమాండ్ చేసిన కేజ్రీవాల్‌తో సన్నిహితంగా పనిచేశారని ఆరోపించింది. పంజాబ్ ఎన్నికల కోసం సౌత్ గ్రూప్‌లోని ఒకరి నుంచి 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని పేర్కొన్నది.
లిక్కర్ పాలసీ తయారీ విషయంలో కలిసి పనిచేద్దామని కవితను కేజ్రీవాల్ వ్యక్తిగతంగా కలిసి చెప్పారని కోర్టుకు వివరించింది. ఈ నేరంలో సొమ్ము వంద కోట్లు మాత్రమే కాదని, ముడుపులు అందించినవారు పొందిన లాభాలు కూడా నేరంలోని సొమ్ముకిందే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నది. విక్రయదారులంతా నిర్దిష్టమొత్తాల్లో నగదు చెల్లించారని ఈడీ తెలిపింది.
ఈ నేరంలో సుమారు 45 కోట్ల రూపాయలు 2020, 2021 మధ్య జరిగిన గోవా ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయని ఈడీ కోర్టుకు వివరించింది. తాము చెబుతున్న అన్ని అంశాలకు దృఢీకరణలు ఉన్నాయని తెలిపింది. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందని, తన సహచరులు చేసినదానికి కేజ్రీవాల్ కూడా బాధ్యులవుతారని పేర్కొంది. తమకు నగదు అందిందని గోవా ఎమ్మెల్యేలు చెప్పారని కోర్టుకు తెలిపింది.
గురువారం రాత్రి అరెస్టయిన కేజ్రీవాల్.. ఆ రాత్రి మొత్తం ఈడీ కస్టడీలోనే ఉన్నారు. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం ఉపసంహరించుకుని, దిగువ కోర్టులో అదే పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విచారణను వినేందుకు వచ్చినవారితో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!తాను జైల్లో ఉన్నా, బయట ఉన్నా తన జీవితం దేశ సేవకు అంకితమని కేజ్రీవాల్ మీడియాతో అన్నారు. అరెస్టు తర్వాత ఆయన తొలి స్పందన ఇది.
- కీలక సూత్రధారీ ఆయనే