వంద మంది మోదీలొచ్చినా ప్రతిపక్షాలదే అధికారం

సంకీర్ణ కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుంది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయితే.. కూటమిపై ఇంకా కుదరని ఏకాభిప్రాయం ఈలోపే తామే సారథ్యం వహిస్తామంటూ ఖర్గే వ్యాఖ్య విధాత : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓడిపోవడం ఖాయమని, ప్రతిపక్షాల సంకీర్ణానికి కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. దీన్ని సాకారం చేసేందుకు తమ పార్టీ ప్రతి ఒక్క […]

  • Publish Date - February 22, 2023 / 09:09 AM IST
  • సంకీర్ణ కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుంది
  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
  • బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు
  • అయితే.. కూటమిపై ఇంకా కుదరని ఏకాభిప్రాయం
  • ఈలోపే తామే సారథ్యం వహిస్తామంటూ ఖర్గే వ్యాఖ్య

విధాత : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓడిపోవడం ఖాయమని, ప్రతిపక్షాల సంకీర్ణానికి కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. దీన్ని సాకారం చేసేందుకు తమ పార్టీ ప్రతి ఒక్క పార్టీతో మాట్లాడుతుందని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనాలన్న ఉమ్మడి అవగాహన ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నా.. ఇంకా అవి ఒక్కతాటిపైకి రానేలేదు. కనీసం ప్రతిపక్షాలు అన్నీ సమావేశమైంది కూడా లేదు. ఎవరికి వారు తమ పార్టీ నుంచే ప్రధాని ఉంటారని సంకేతాలు ఇస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు భావి ప్రధానిగా భావిస్తున్నాయి. దేశ్‌ కీ నేత కేసీఆర్‌ అంటూ నినాదాలు ఇస్తున్నాయి. మరోవైపు నితీశ్‌కుమార్‌, మమతాబెనర్జీ వంటి నేతలు కూడా ప్రధాని పీఠంపై కన్నేశారనే వాదనలు ఉన్నాయి. ఇలా ఎవరి మధ్యా ఒక అవగాహన లేని సమయంలో ఖర్గే ఏకపక్షంగా తమ పార్టీయే సంకీర్ణానికి నాయకత్వం వహిస్తుందని చెప్పడం రాజకీయంగా సంచనలం రేపింది. ఇది ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు దారి తీస్తుందా? లేక ఉన్న ఐక్యతను కూడా దెబ్బతీస్తుందా అనేది తదుపరి తేలనున్నది.

మోదీ.. ఇది ప్రజాస్వామ్యం

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నాగాలాండ్‌ (Nagaland)లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ ‘దేశాన్ని ఎదుర్కొనగల ఏకైక వ్యక్తిని నేనే. నన్నెవ్వరూ ముట్టుకోలేరు’ అని ప్రధాని మోదీ (Prime Minister Narendra) పలు సందర్భాల్లో చెప్పారని, ఏ ప్రజాస్వామికవాదీ ఇటువంటి వ్యాఖ్యలు చేయరని అన్నారు. ప్రజాస్వామ్యం (Democracy)లో ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మోదీకి హితవు పలికారు.

‘నువ్వేమీ నియంతవు (Dictator) కాదు. నువ్వు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తివి. అదే ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు’ అని నాగాలాండ్‌లో జరిగిన సభలో ఖర్గే ప్రధాని మోదీని ఉద్దేశించి హెచ్చరించారు. ‘2024లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీతో మేం మాట్లాడుతున్నాం. బీజేపీ అధికారం నుంచి దిగిపోకపోతే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేవి మాయమైపోతాయి’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.

బీజేపీకి మెజార్టీ దక్కదు

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ దక్కదన్న ఖర్గే.. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిస్తే వందమంది మోదీలు, వందమంది అమిత్‌షా(Home Minister Amit Shah)లు వచ్చినా ప్రతిపక్షాల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. మేఘాలయ (Meghalaya), నాగాలాండ్‌ (Nagaland) అసెంబ్లీలకు సోమవారం ఎన్నికలు జరుగనున్నాయి. గతవారం త్రిపుర (Tripura) ఎన్నికలు ముగిశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి పోటాపోటీగా కాంగ్రెస్‌ ఉన్నదన్న అంచనాలు వెలువడుతున్నాయి. త్రిపురలో తన దీర్ఘకాలిక రాజకీయ ప్రత్యర్థి అయిన సీపీఎంతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. సంకీర్ణ ప్రభుత్వానికి తామే నాయకత్వం వహిస్తామని ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.