Odisha Train Crash | కొడుకును బ‌తికించిన తండ్రి ఆశ‌.. కోల్‌క‌త్తా నుంచి అంబులెన్స్‌తో 230 కి.మీ తండ్రి ప్ర‌యాణం

ఒడిశా రైలు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ కుమారుడు ఫోన్‌లో తండ్రికి స‌మాచారం చేర‌వేత‌.. త‌ర్వాత గ‌ల్లంతు కోల్‌క‌త్తా నుంచి అంబులెన్స్‌తో 230 కి.మీ తండ్రి ప్ర‌యాణం ఘ‌ట‌నాస్థలికి చేరి కొడుకు కోసం ద‌వాఖాన‌ల్లో వెతుకులాట‌ చివ‌రకు శ‌వాగారంలో అప‌స్మార‌క‌స్థితిలో స‌జీవంగా కొడుకు గుర్తింపు అంబులెన్స్‌లో తీసుకెళ్లి చికిత్స‌.. నిల‌క‌డ‌గా కుమారుడి ఆరోగ్యం విధాత‌: నాన్నా.. నేను ప్ర‌యాణిస్తున్న రైలు ప్ర‌మాదానికి గురైంది. బోగీల మ‌ధ్య‌ ఎటూ క‌ద‌ల‌లేని స్థితిలో ఉన్న‌. కానీ, ప్రాణాల‌తోనే ఉన్న‌.. కాపాడు నాన్న‌.. […]

Odisha Train Crash | కొడుకును బ‌తికించిన తండ్రి ఆశ‌.. కోల్‌క‌త్తా నుంచి అంబులెన్స్‌తో 230 కి.మీ తండ్రి ప్ర‌యాణం
  • ఒడిశా రైలు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ కుమారుడు
  • ఫోన్‌లో తండ్రికి స‌మాచారం చేర‌వేత‌.. త‌ర్వాత గ‌ల్లంతు
  • కోల్‌క‌త్తా నుంచి అంబులెన్స్‌తో 230 కి.మీ తండ్రి ప్ర‌యాణం
  • ఘ‌ట‌నాస్థలికి చేరి కొడుకు కోసం ద‌వాఖాన‌ల్లో వెతుకులాట‌
  • చివ‌రకు శ‌వాగారంలో అప‌స్మార‌క‌స్థితిలో స‌జీవంగా కొడుకు గుర్తింపు
  • అంబులెన్స్‌లో తీసుకెళ్లి చికిత్స‌.. నిల‌క‌డ‌గా కుమారుడి ఆరోగ్యం

విధాత‌: నాన్నా.. నేను ప్ర‌యాణిస్తున్న రైలు ప్ర‌మాదానికి గురైంది. బోగీల మ‌ధ్య‌ ఎటూ క‌ద‌ల‌లేని స్థితిలో ఉన్న‌. కానీ, ప్రాణాల‌తోనే ఉన్న‌.. కాపాడు నాన్న‌.. ! అని పీల గొంతుతో కొడుకు అన్న మాట‌లు విన్న ఆ తండ్రి ఖిన్నుడై పోయాడు. వెంట‌నే త‌న బంధువును వెంట‌బెట్టుకొని అంబులెన్స్‌తో స‌హా బ‌య‌లు దేరాడు. ఐదు ప‌ది కిలోమీట‌ర్లు కాదు ఏకంగా 230 కిలోమీట‌ర్లు ఎక్క‌డా ఆగ‌కుండా ప్ర‌యాణించాడు. కోల్‌క‌త్తా నుంచి ఒడిశాలో రైలు ప్ర‌మాదం (Odisha train crash) జ‌రిగిన స్థ‌లానికి శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు చేరుకున్నాడు.

క్ష‌త‌గాత్రుల‌కు చికిత్స అందిస్తున్న అన్ని ద‌వాఖాన‌ల్లో వెతికినా కొడుకు ఆచూకీ ల‌భించ‌లేదు. అయినా, ఆ తండ్రి కొడుకుపై ఆశ వ‌దులుకోలేదు. ఇక మిగిలింది.. శ‌వాగార‌మే. చివ‌రికి అక్క‌డికీ వెళ్లాడు. అప‌స్మార‌క‌ స్థితిలో స‌జీవంగా ఉన్న కొడుకును గుర్తించాడు. వెంట‌నే ద‌వాఖాన‌కు త‌ర‌లించి చికిత్స అందించి కొడుకుకు ఆ తండ్రి పున‌ర్జ‌న్మ ప్ర‌సాదించాడు. ఆ తండ్రి సాహ‌సానికి, య‌ముడు కూడా భ‌య‌ప‌డ్డాడేమో కొడుకును బ‌తికించాడు.

4.20 గంట‌లు.. 230 కిలోమీట‌ర్లు

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని హౌరా జిల్లాకు చెందిన హేలరామ్ మాలిక్ అనే దుకాణదారుడికి బిశ్వ‌జిత్ అనే 24 ఏండ్ల కొడుకు ఉన్నాడు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి శుక్ర‌వారం షాలిమార్ స్టేషన్‌లో కొడుకు బిస్వజిత్‌ను దింపేసి వెళ్లాడు. కొద్ది గంటలకే ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడం గురించి బాధ కలిగించే వార్త వచ్చింది.

కొడుకు బిశ్వ‌జిత్ సైతం రైలు ప్ర‌మాదంలో తాను తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు తండ్రికి ఫోన్‌లో స‌మాచారం అందించాడు. తన బావ దీపక్ దాస్‌తో కలిసి హేలరామ్ అంబులెన్స్‌తో బ‌య‌లుదేరాడు. సుమారు 4.30 గంట‌ల‌ పాటు 230 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి శుక్రవారం అర్థరాత్రి వ‌ర‌కు బాలాసోర్ చేరుకున్నారు.

ద‌వాఖాన చుట్టూ చ‌క్క‌ర్లు

రైలు ప్ర‌మాదంలో గాయ‌ ప‌డిన వారికి చికిత్స అందిస్తున్న ద‌వాఖాన‌ల వ‌ద్ద‌కు హేలరామ్ వెళ్లాడు. వైద్యుల‌ను, ఇత‌రుల‌ను త‌న కుమారుడి గురించి అడిగాడు. ఒక దవాఖాన నుంచి మ‌రో ద‌వాఖాన ఇలా అన్ని ద‌వాఖాన‌ల్లో అన్ని వార్డుల్లో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను క్షుణంగా ప‌రిశీలించాడు. ఎక్క‌డా త‌న కొడుకు బిశ్వ‌జిత్ ఆచూకీ ల‌భించ‌లేదు.

ఆయినా కొడుకుపై ఆశ వ‌దులు కోలేదు హేలరామ్. ద‌వాఖాన‌ల్లో ఎక్క‌డా క‌నిపించ‌క‌ పోతే మృతదేహాలను ఉంచిన బహనాగా ఉన్నత పాఠశాల‌లో చూడాలని ఓ వ్య‌క్తి హేలరామ్ కు సూచించాడు. కానీ, త‌న కొడుకు చ‌నిపోయి ఉండ‌డ‌నే న‌మ్మ‌కంతోనే ఉన్నాడు. అయినా, అక్క‌డి వెళ్లారు.

శ‌వాగారంలో అప‌స్మార‌క‌స్థితిలో..

పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో అనేక మృత‌దేహాలు ఉన్నాయి. ఏడుపులు పెడ‌బొబ్బ‌ల‌తో అక్క‌డ వాతావ‌ర‌ణం భ‌యంక‌రంగా ఉన్న‌ది. అక్క‌డ ఒక యువ‌కుడి చేయిలో చ‌ల‌నం క‌నిపించింది. ఆ వ్యక్తి మరెవరో కాదు బిశ్వజిత్. అపస్మారక స్థితిలో ఉన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి, మామ వెంటనే అతన్ని అంబులెన్స్‌లో ఎక్కించి బాలాసోర్ ద‌వాఖాన‌కు తరలించారు. అక్కడ బిశ్వ‌జిత్ చికిత్స పొందాడు. అతని పరిస్థితి దృష్ట్యా వైద్యులు అతనిని కటక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు.

కానీ, అక్క‌డి నుంచి డిశ్చార్జి చేసుకొని కుటుంబ సభ్యులు బిశ్వజిత్‌ను తదుపరి చికిత్స కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ద‌వాఖాన‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్న‌ప్ప‌క‌టికీ నిలకడగా ఉన్న‌ది. అప్ప‌టికే బిశ్వ‌జిత్ చీలమండకు శస్త్రచికిత్స జ‌రిగింది. ప్రాణాపాయం ఏమీ లేదు కానీ, అత‌డు కోలు కోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు తెలిపారు. కొడుకును ఎలాగైనా బ‌తికించుకోవాల‌నే ఆశ‌తో తండ్రి చేసిన సాహ‌సానికి ఎవ‌రైనా స‌లాం చెప్పాల్సిందే.