ఎట్టకేలకు షర్మిల పాదయాత్రకు పోలీసు పర్మిషన్

పాదయాత్రపై సర్వత్రా ఆసక్తి ఆగిపోయిన శంకరమ్మ తండా నుంచి తిరిగి ప్రారంభం వరంగల్ సీపీ రంగనాథ్ నిబంధనలతో.. ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు అనుమతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విమర్శలూ.. ప్రతి విమర్శలూ.. దాడులు.. అరెస్టులు.. నిరసనల నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు తిరిగి వరంగల్ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు పాదయాత్ర తిరిగి నిర్వహించు కోవడానికి అనుమతించారు. […]

ఎట్టకేలకు షర్మిల పాదయాత్రకు పోలీసు పర్మిషన్
  • పాదయాత్రపై సర్వత్రా ఆసక్తి
  • ఆగిపోయిన శంకరమ్మ తండా నుంచి తిరిగి ప్రారంభం
  • వరంగల్ సీపీ రంగనాథ్ నిబంధనలతో.. ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు అనుమతి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విమర్శలూ.. ప్రతి విమర్శలూ.. దాడులు.. అరెస్టులు.. నిరసనల నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు తిరిగి వరంగల్ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు పాదయాత్ర తిరిగి నిర్వహించు కోవడానికి అనుమతించారు. పాదయాత్రకు సంబంధించి వరంగల్ పోలీసు కమిషనర్ ఏవి రంగనాథ్ శుక్రవారం అనుమతించారు. దీంతో మరోసారి షర్మిల చేపట్టే ప్రజాప్రస్థానం యాత్ర చర్చనీయాంశంగా మారింది.

ఆగిన శంకరమ్మ తండా నుంచే ప్రారంభం

వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండ వద్ద గతేడాది నవంబర్ 28న షర్మిల అరెస్ట్ తో పాదయాత్ర ఆగిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో కూడా కొనసాగించారు. ఈ క్రమంలో నల్లబెల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై పలు అవినీతి ఆరోపణలు షర్మిల చేశారు.

యాత్ర వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలో కొనసాగుతున్న సమయంలో ఆమె పాదయాత్ర పై ఎమ్మెల్యే అనుచరులు, తెలంగాణవాదులు, బిఆర్ఎస్ కార్యకర్తలు, కారవాన్, ప్రచార వాహనాలపై దాడి చేసి కొన్నింటికి నిప్పు పెట్టారు. ప్రచార సామాగ్రిని ధ్వంసం చేసి ప్లెక్సీలు చించి వేశారు.

సకాలంలో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు స్పందించి మంటలు ఆర్పి వేశారు. ఈ ఆకస్మిక దాడితో ఉద్రిక్తత తలెత్తిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తకరమైన వాతావరణం కారణంగా షర్మిలకు పోలీసులు నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. అనంతరం ఆమెని పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. తదుపరి పాదయాత్రకు పోలీసులు ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు. దీంతో షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది.

తాజాగా తిరిగి యాత్రకు అనుమతి

తాజాగా పాదయాత్ర కోసం ఆమె చేసుకున్న ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు. శనివారం నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు షర్మిల అనుమతి కోరగా పోలీసులు అందుకు అంగీకరించలేదు. వచ్చేనెల రెండవ తేదీన ప్రారంభించి 18వ తేదీ వరకు కొనసాగించేందుకు నిబంధనలతో కూడిన అనుమతిని ఇచ్చారు. దీంతో ఎక్కడైతే తన పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచి ఫిబ్రవరి రెండవ తేదీన ప్రారంభించేందుకు షర్మిల సమాయత్తమైతుంది.

నెక్కొండ మండలం శంకరమ్మ తండా నుంచి పాదయాత్ర పునః ప్రారంభించనున్నారు. లింగగిరి గ్రామం శంకరమ్మ తండా నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్, జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.

షరతులతో కూడిన అనుమతి

గతానికి భిన్నంగా ఈసారి యాత్రకు పలు నిబంధనలతో కూడిన అనుమతిని ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 7వరకూ మాత్రమే పాదయాత్ర చేసుకోవచ్చని నిబంధన విధించారు. అదేవిధంగా పాదయాత్రలో పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు
చేయవద్దని, ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దని, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కల్గించవద్దు’ అని అనేక నిబంధనలతో సీపీ పర్మిషన్ ఇచ్చారు.

ఆగిపోయిన శంకరమ్మ తండా నుంచి షర్మిల తిరిగి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో అనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈసారి నర్సంపేట నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర కొనసాగినంత సేపు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు సమాచారం.

నిబంధనల పట్ల షర్మిల అసంతృప్తి

తన పాదయాత్రకు వరంగల్ పోలీసులు తాజాగా పెట్టిన నిబంధనలను షర్మిల నిరసించినట్టు సమాచారం. ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకైనా ప్రజా సమస్యలను తెలుసుకునే హక్కు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అధికార పార్టీ ఒత్తిడి మేరకు పోలీసులు తమ యాత్రకు షరతులు విధించినట్లు భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు తెలుసుకొని కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.