హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. బంగారం, నగదు దోపిడీ
Hyderabad | హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ బంగారు దుకాణంలోకి చొరబడ్డ దొంగలు.. దుకాణం యజమాని, బంగారం వ్యాపారిపై కాల్పులు జరిపారు. అనంతరం బంగారం, నగదు దోచుకుని వెళ్లిపోయారు. ఈ కాల్పుల ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన కల్యాణ్ చౌదరి 15 ఏండ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. వనస్థలిపురంలో నివాసముంటూ.. చైతన్యపురి పీఎస్ పరిధిలోని స్నేహపురి కాలనీలో గత 11 ఏండ్ల నుంచి మహాదేవ్ […]

Hyderabad | హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ బంగారు దుకాణంలోకి చొరబడ్డ దొంగలు.. దుకాణం యజమాని, బంగారం వ్యాపారిపై కాల్పులు జరిపారు. అనంతరం బంగారం, నగదు దోచుకుని వెళ్లిపోయారు. ఈ కాల్పుల ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన కల్యాణ్ చౌదరి 15 ఏండ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. వనస్థలిపురంలో నివాసముంటూ.. చైతన్యపురి పీఎస్ పరిధిలోని స్నేహపురి కాలనీలో గత 11 ఏండ్ల నుంచి మహాదేవ్ జ్యువెలరీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో షాపు మూసేందుకు కల్యాణ్ సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో ఆభరణాల వ్యాపారి రాజ్‌కుమార్ సురానా సుఖ్‌దేవ్ సికింద్రాబాద్ నుంచి బంగారం తీసుకొచ్చాడు.
సుఖ్‌దేవ్ బంగారం తీసుకొని దుకాణంలోకి ప్రవేశించగానే, బైక్‌పై వచ్చిన ఓ ఇద్దరు దుండగులు లోపలికి వెళ్లారు. అక్కడున్న కస్టమర్లను బలవంతంగా బయటికి పంపించేశారు. షట్టర్‌ను మూసేశారు. దేశీ తుపాకీతో కల్యాణ్‌ను, సుఖ్‌దేవ్‌ను బెదిరించారు. బంగారం, నగదు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో దుండగులను వారిద్దరూ అడ్డుకున్నారు. ఈ క్రమంలో కల్యాణ్, సుఖ్‌దేవ్‌పై కాల్పులు జరపడంతో వారు తీవ్ర గాయాలపాలై కుప్పకూలారు. ఇక సుఖ్‌దేవ్ తీసుకొచ్చిన బంగారం, షాపులో ఉన్న నగదును దుండగులు అపహరించారు.
కాల్పుల శబ్దం విన్న కస్టమర్లు షట్టర్‌ను లేపేసరికి.. దుండగులు పారిపోయారు. స్థానికుల సాయంతో రక్తపు మడుగులో ఉన్న కల్యాణ్, సుఖ్‌దేవ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రతి గురువారం బంగారం తీసుకొస్తారనే సమాచారాన్ని దుండగులు పసిగట్టి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు మొత్తం నలుగురు రాగా, ఇద్దరు బయట ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.