Forest Act | ‘అటవీ’ సవరణ చట్టం అనర్థమే! నూతన ప్రతిపాదనలతో నష్టమే ఎక్కువ
Forest Act | నూతన ప్రతిపాదనలతో లాభం కంటే నష్టమే ఎక్కువ అటవీ ధ్వంసం… పర్యావరణం, జీవవైవిధ్యం విధ్వంసం గిరిజనుల జీవనోపాధి, సాంస్కృతిపై తీవ్ర ప్రభావితం చర్చించకుండానే అటవీ (పరిరక్షణ) బిల్లుకు ఆమోదం పర్యావరణ నిపుణులు, గిరిజన సంఘాల ఆందోళన విధాత: ఉభయ సభలు ఇటీవల ఆమోదించిన అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు-2023తో లాభం కంటే, నష్టమే ఎక్కువ అని పర్యావరణ నిపుణులు, విధాన నిర్ణేతలు, గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటవీ చట్టం 1980కి […]

Forest Act |
- నూతన ప్రతిపాదనలతో లాభం కంటే నష్టమే ఎక్కువ
- అటవీ ధ్వంసం… పర్యావరణం, జీవవైవిధ్యం విధ్వంసం
- గిరిజనుల జీవనోపాధి, సాంస్కృతిపై తీవ్ర ప్రభావితం
- చర్చించకుండానే అటవీ (పరిరక్షణ) బిల్లుకు ఆమోదం
- పర్యావరణ నిపుణులు, గిరిజన సంఘాల ఆందోళన
విధాత: ఉభయ సభలు ఇటీవల ఆమోదించిన అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు-2023తో లాభం కంటే, నష్టమే ఎక్కువ అని పర్యావరణ నిపుణులు, విధాన నిర్ణేతలు, గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అటవీ చట్టం 1980కి చేసిన సవరణలతో ప్రైవేట్, లాభాపేక్షతో నడిచే కంపెనీలు, సంస్థలు మరింత లాభపడతాయని ఆరోపిస్తున్నాయి. అటవీ సంపదను దోచుకొనేందుకు వాటికి మార్గం సుగమం అయిందని చెప్తున్నాయి. జంతుజాలానికి ప్రమాదం వాటిల్లుతుందని, జీవవైవిధ్యం దెబ్బతింటుందని వాపోతున్నాయి. గిరిజనుల జీవనోపాధిని కూడా కొత్త చట్టం ప్రభావితం చేస్తుందని ఆరోపించాయి.
వివాదాస్పదమైన అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచించిన అన్ని ప్రతిపాదిత సవరణలను చర్చించకుండానే ఉభయ సభలు ఆమోదం తెలుపడంపై కూడా ఆయా సంఘాలు మండిపడుతున్నాయి.
అటవీ పరిరక్షణ ఉమ్మడి అంశం అయినప్పటికీ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం చట్టం తేవడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు-2023ను రాజ్యసభ, లోక్‌సభ ఆమోదించడంతో ఇది ఇప్పుడు అటవీ (పరిరక్షణ-పెంపుదల) చట్టం 1980 గా మారింది.
కొత్త ప్రతిపాదనలు ఇవి..
దేశ సరిహద్దులో 100 కిలోమీటర్ల పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనుమతి ఇవ్వడం, రహదారులు, రైల్వే ట్రాక్‌ల పక్కన నిర్మాణాలకు ఓకే చెప్పడం, అటవీ ప్రాంతాల్లో సఫారీలు, జంతు ప్రదర్శనశాలల నిర్వహణ వంటి కొత్త ప్రతిపాదనలు కొత్త చట్టంలో ఉన్నాయి.
విమర్శలు ఇవి..
అటవీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెరుగుదల, అభివృద్ధి రూపంలో పెరుగుతున్న మానవ ఒత్తిడి కారణంగా అటవీ విస్తీర్ణం, జీవ వైవిధ్య వృద్ధి, అటవీ పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోమౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం విస్తారమైన అటవీ ధ్వంసమవుతుంది. ఇది దేశంలోని అనేక గిరిజన ప్రజల, జీవితాలను, జీవనోపాధిని దెబ్బతీస్తుంది. అటవీ ప్రాంతాలలో జంతు ప్రదర్శనశాలలు, సఫారీలు, పర్యావరణ ఉద్యానవనాలకు అనుమతించడం వల్ల పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది.
జంతువుల కదలికలు, వాటి నివాసాలను ప్రమాదం ఏర్పడుతుంది. అటవీ ప్రాంగణంలో ప్రైవేటు సంస్థలు నిర్వహించే జంతుప్రదర్శనశాలలు, సఫారీలు, పర్యావరణ ఉద్యానవనాల స్థాపనకు అనారోగ్యకరమైన పోటీని కూడా పెంచుతుంది.
పర్యాటకుల రద్దీ ప్రసిద్ధ పర్యావరణ పర్యాటక ప్రాంతాల్లో సహజ పర్యావరణం, వన్యప్రాణులపై ఒత్తిడిని కలిగిస్తుంది. అటవీ ప్రాంతాల్లో చెత్త పోగుపడుతుంది. కాలుష్యం పెరుగుతుంది. జంతువుల ఆవాసాలకు భంగం వాటిల్లుతుంది. వాటి ప్రవర్తన, సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది.
గిరిజన సంప్రదాయాలు దెబ్బతింటాయి..
టూరిజం అభివృద్ధి స్థానిక సంస్కృతులు, సంప్రదాయాలు, సాంస్కృతిక ధ్వంసానికి దారితీస్తుంది. పర్యాటకుల ప్రవర్తన, వేషధారణ స్థానికులను ఆకర్శిస్తుంది. ఇది గిరిజన వర్గాలలో సంప్రదాయ జ్ఞానం, నమ్మకాలు, విశ్వాసాలు, అభ్యాసాలను కోల్పోయేలా చేస్తుంది. పర్యావరణ పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం కూడా స్థానికులకు పూర్తిస్థాయిలో అందదు. లాభాలు పెట్టుబడిదారులు, పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్తాయి.
అడవులను పునర్నిర్వచించడం ద్వారా నష్టం
కొత్త చట్టంలో అడవులను పునర్నిర్వచించడం ద్వారా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లనున్నది. సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన ఆదేశాలకు ఈ బిల్లు విరుద్ధంగా ఉన్నది. యాజమాన్యం, గుర్తింపు, వర్గీకరణతో సంబంధం లేకుండా ఏదైనా ప్రభుత్వ రికార్డుల్లో అటవీగా నమోదైన ప్రాంతం డీమ్డ్ ఫారెస్ట్‌గా మారుతుందని సుప్రీంకోర్టు పేర్కొంటూ రక్షణ కల్పించింది.
ప్రస్తుత చట్టంలో దీనిని సవరించడం వల్ల భారతదేశంలోని అడవుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు వరకు చట్టపరమైన రక్షణను కోల్పోనున్నది. ఈ ప్రాంతాలు వాస్తవానికి అటవీప్రాంతం అయినప్పటికీ, రెవెన్యూ రికార్డుల్లో అధికారికంగా గుర్తించలేదు. దీంతో భారతదేశంలోని విస్తృతమైన అటవీ ప్రాంతాలు, వాణిజ్య ప్రయోజనాల కోసం దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది.
బిల్లుకు వ్యతిరేకంగా 1300 అభ్యర్థనలు
రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు, పర్యావరణవేత్తలు, గిరిజన కార్యకర్తలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా 1,300పైగా అభ్యర్ధనలు దాఖలు చేశారు. బిల్లు మరింత ఆమోదయోగ్యంగా మార్చేందుకు ప్రతిపక్షాల సూచనలు, సలహాలు తీసుకోవాలని, ఉభయ సభల్లో లోతుగా చర్చించాలని కోరారు. కానీ, మణిపూర్ హింసకాండపై చర్చించాలనే విపక్షాల ఆందోళనల నడుమ అత్యంత ప్రాధాన్యం కలిగిన అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు-2023 ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలో ఆమోదం పొందడం విమర్శలకు దారితీసింది.