కాంగ్రెస్ పాలనలో మొదలైన కరెంటు కోతలు
కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంటు కోతలు.. పంటలు ఎండిపోవడం మొదలయ్యాయని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు.

- రైతన్నలకు మళ్లీ కష్టాలే
- మాజీ మంత్రి టి.హరీశ్‌రావు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంటు కోతలు.. పంటలు ఎండిపోవడం మొదలయ్యాయని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో మున్నూరు కాపులకు జహీరాబాద్ టికెట్ కేటాయించాలని మున్నూరు కాపు సంఘం నేతలు తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరుకాపుల వినతిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతానని, వీలైనంతవరకు కేసీఆర్ సామాజిక సమీకరణల్లో అందరికి అవకాశం కల్పించే నాయకుడన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో కరెంటు కోతలు మొదల్వగా, కేసీఆర్ పాలనలో ఏ ఒక్క రోజు కరెంటు పోలేదని చెప్పుకొచ్చారు. వంద రోజుల్లో 13 హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ అన్నారని, మార్చి 9ముగిసినా రుణమాఫీ మాత్రం అమలు కావడం లేదని విమర్మించారు. పంటకు 500బోనస్, రుణమాఫీ రైతుబంధు, ఉచిత కరెంటు విషయంలో కాంగ్రెస్ మోసపూరిత వైఖరితో వ్యవహారిస్తుందన్నారు. మొత్తం 420 హామీలలోనూ అదే వైఖరి అనుసరిస్తున్నారన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని, ఆ పార్టీ సీఎం రేవంత్ చెప్పకనే చెప్పారని, మోదీని బడే భాయ్ అని, ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని రేవంత్ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే పోయేదేమీ లేదని, అందుకే ప్రజలు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆరెస్‌ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బీఆరెస్ పోరాటాలతోనే సాధ్యం అవుతుందన్నారు. రెండు సార్లు బీఆరెస్ నుంచి గెలిపిస్తే పార్టీకి మోసం చేసిన బీబీ పాటిల్ బీజేపీలో చేరారని, వచ్చే ఎన్నికల్లో ఆయనను, బీజేపీని, కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.