Shashidhar Reddy |
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా రామాయంపేట రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలని , ఎన్‌డీసీఎల్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, వర్షానికి దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 50 కోట్లు నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే, పీసీసీ సభ్యులు పట్లోళ్ళ శశిధర్ రెడ్డి సోమవారం బహిరంగ లేఖ రాశారు.
రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం ఏళ్లు గా పోరాటం కొనసాగుతుందని, రామాయంపేటకు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రామాయంపేటకు బస్ డిపో కోసం స్థలం ఎప్పుడో కేటాయించడం జరిగిందనీ వెంటనే రామాయంపేట లో బస్ డిపో ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఘనపూర్ ప్రాజెక్టు ఎత్తు పెంపు కోసం రైతుల నుండి భూ సేకరణ చేశారని, రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని శశిధర్ రెడ్డి బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన నిజాంపేట్ మండల తహశీల్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు.