ఆక్టోబర్ 1, 3 తేదీల్లో ప్రధానీ మోడీ తెలంగాణ పర్యటన: కిషన్‌రెడ్డి

  • Publish Date - September 24, 2023 / 10:13 AM IST
  • ఇప్పటిదాకా తెలంగాణకు 9లక్షల కోట్ల కేంద్ర నిధులు
  • కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడి

విధాత: ఆక్టోబర్ 1, 3తేదీలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం వందేభారత్ రైలు వర్చువల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన కాచిగూడ వద్ధ మీడియాతో మాట్లాడారు. 1వ తేదీన హైద్రాబాద్‌, మహబూబ్‌నగర్ భూత్పూర్ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారని, హైద్రాబాద్‌లో సివిల్ ఏవియేషన్ సెంటర్‌ను మోడీ ప్రారంభిస్తారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన తెలిపారు. తదుపరి 3వ తేదీన మోడీ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు.

మోడీ మోడీ హాయంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం 9లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు కేటాయించిందన్నారు. తెలంగాణకు నూతన రైల్వే లైన్ల నిర్మాణం సర్వేలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ఢిల్లీకి కలిపేలా నూతన రైల్వే లేన్లు రాబోతున్నాయన్నారు. వందేభారత్ రైళ్లను ప్రజలు విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.

హైద్రాబాద్ చుట్టు రిజినల్ రింగ్ రోడ్డు కోసం 20వేల కోట్లు కేటాయించిందని, దాని చుట్టు రైల్వే లైన్ల నిర్మాణానికి , రైల్ రింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. హైద్రాబాద్ నగరం విస్తరణ కోణంలో రవాణా రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకుంటుందన్నారు. హైద్రాబాద్‌లో రద్ధీని తగ్గించేందుకు చర్లపల్లిలో రైల్వే టెర్మినల్ నిర్మిస్తున్నామన్నారు. ఈ టెర్మినల్‌ను ఈ ఏడాది చివరిలో ప్రధాని మోడీ ప్రారంభిస్తారన్నారు.

వరంగల్‌లో రైల్వే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం చేసుకుంటున్నామన్నారు. సులంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతుందని, గతంలో పోటీ పరీక్షల లీకేజీతో ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించడంతో గ్రూప్ 1ప్రిలీమ్స్ ను మళ్లీ కోర్టు రద్ధు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కోచింగ్‌లు తీసుకుని అభ్యర్థులు మానసిక వేధన, ఆర్ధిక కష్టాల పాలయ్యారన్నారు. పరీక్షలు నిర్వహించలేని స్థితికి కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందని విమర్శించారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.