Gaddar Awards: గద్దర్ ఫోటో లేకుండానే గద్దర్ అవార్డ్సు ఆహ్వానపత్రిక!

Gaddar Awards: గద్దర్ ఫోటో లేకుండానే గద్దర్ అవార్డ్సు ఆహ్వానపత్రిక!

విధాత, హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంకు సంబంధించి ముద్రించిన ఆహ్వాన పత్రిక హాట్ టాపిక్ గా మారింది. శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సం జరుగునుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక గద్దర్ ఫోటో లేకుండానే ప్రభుత్వం ముద్రించింది. గద్దర్ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో పెట్టకుండా కేవలం అవార్డు చిహ్నం ఫోటోను మాత్రమే ముద్రించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీజీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు ఫోటోలతో ఆహ్వాన పత్రికను ముద్రించారు.

ఇదే అంశాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పేరుకే గద్దర్ అవార్డ్స్.. కానీ ఫోటోలు మాత్రం కాంగ్రెస్సోళ్లవే అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా విమర్శల దాడి చేస్తుంది. ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటోను ఎక్కడా పెట్టకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫిల్మ్ అవార్డు ఫోటోను పెట్టామని..అదే ప్రధానం కదా అని కాంగ్రెస్ వర్గాలు కౌంటర్ వేస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా వివాదస్పదంగా మారింది.

గద్దర్ ను అవమానించడమే : ఎమ్మెల్సీ కవిత

గద్దర్ సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరమని..ఈ చర్య ప్రజా గాయకుడు గద్దర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడంగా భావిస్తూ.. తీవ్రంగా ఖండిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్..వారి పేరు మీద ఇస్తున్నటువంటి సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో పెట్టకపోవడం బాధకరమన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా గద్దర్ చిత్రపటాన్ని పెట్టి వారిని గౌరవించాలని కోరుతున్నానని కవిత పేర్కొన్నారు.