తెలంగాణ ప్రజల ప్రేమ, ఆప్యాయత మరువలేనివి: గవర్నర్ తమిళిసై
తెలంగాణ ప్రజల ప్రేమ, ఆప్యాయత మరువలేనివని గవర్నర్ తమిళ సై అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి పనిలో విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు

ప్రతి పనిలో విజయం సాధించాలని
నూతన సంవత్సర వేడుకల్లో ఆకాంక్ష
విధాత: తెలంగాణ ప్రజల ప్రేమ, ఆప్యాయత మరువలేనివని గవర్నర్ తమిళ సై అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి పనిలో విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. సోమవారం రాజ్ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
వేడుకలకు వచ్చిన సుమారు 3,500 మందిని కలుసుకున్నట్లు చెప్పిన గవర్నర్.. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు. బొకేలు వద్దు.. బుక్స్, నోట్స్ ఇవ్వాలని సూచించిన మేరకు చాలామంది బుక్స్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పేద పిల్లలకు ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గవర్నర్ పేరుతో వాట్సప్ చానల్ ను ప్రారంభించామని, ఇక నుంచి రాజ్ భవన్ కు చెందిన అప్ డేట్స్ ఈ చానల్ ద్వారా వీక్షించవచ్చని పేర్కొన్నారు.