బండెడు కష్టాల్లో బల్దియా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు కాసుల కష్టాలు చుట్టుముట్టాయి

- వెలవెలబోతున్న ఖజానా
- జీహెచ్ఎంసీ అప్పులు రూ.6314 కోట్లు
- ప్రతి రోజు చెల్లిస్తున్న వడ్డీ రూ.1.50 కోట్లు
- మందగించిన పన్ను వసూళ్లు
- భారమైన బిల్లులు.. ఉద్యోగుల జీతాలు
- కొత్త ప్రాజెక్టులకు గండమే..
- ఆశలన్నీ రాష్ట్ర ప్రభుత్వంపైనే..
విధాత, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు కాసుల కష్టాలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు కాసులతో గల గలలాడిన బల్దియా ఖజానా.. నేడు వెలవెలబోతోంది. అప్పుడున్న ఫిక్స్ డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మరోవైపు పన్ను వసూళ్లు మందగించాయి. ఇంకోవైపు ప్రభుత్వమూ ఆదుకోలేదు. ఈ నేపథ్యంలో బల్దియా బండెడు కష్టాల్లో మునిగిపోయిందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. చివరకు ఉద్యోగులకు జీతాల చెల్లింపూ భారంగా మారింది.
మొదటి తేదీనే చెల్లించే జీతాలు.. నెల మధ్య వరకు ఉద్యోగుల ఖాతాలకు జమకాని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లోనూ జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధుల విడుదలలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆస్తి పన్ను, మోటార్ వెహికిల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ టాక్స్, మ్యూటేషన్ ఫీజు, ట్రాన్స్ ఫర్ డ్యూటీ వంటివి రెగ్యులర్ గా ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు. అయితే ఇందులో చాలా వాటిని గత ప్రభుత్వం చెల్లించలేదని తెలుస్తోంది. దీంతోనే బల్దియా తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోయిందన్న విమర్శలున్నాయి.
కొత్త ప్రాజెక్టులు, బిల్లుల గోల
జీహెచ్ఎంసీని చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారాయి. మహానగర వ్యాప్తంగా పాలకవర్గం ఇబ్బడిముబ్బడిగా కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేపట్టింది. కొన్నింటిని ప్రారంభించి… నిధులు లేక అర్ధంతరంగా పనులు నిలిపేసే దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈక్రమంలో వందల కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నుండి ప్రాజెక్టులకు పైసా నిధులు విదల్చలేదు.
దీంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల కోసం రూ.6314 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. ఎలాగోలా కొంతమేర అభివృద్ధి పనులను ఈ నిధులతో నెట్టుకొచ్చినా… తీసుకున్న అప్పుకు చెలించాల్సిన వడ్డీ జీహెచ్ఎంసీకి చుక్కలు చూపిస్తోంది. ఏకంగా ప్రతి రోజు కోటిన్నర రూపాయల వరకు వడ్డీ చెల్లిస్తోంది. రోజుకో కొత్త ప్రాజెక్టును అమలు చేయ్యాలంటూ బల్దియాపై ఒత్తిడిపెట్టింది. దీంతో ఓవైపు జీతాలు… మరోవైపు మెయింటెనెన్స్ ను వెళ్లదీయడం జీహెచ్ఎంసీకి కష్టంగా మారింది.
ఒకటో తారీకు వచ్చిందంటే చాలు, ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లు ఆపాలి.. ఏ బిల్లు విడుదల చెయ్యాలి అంటూ ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటున్నారు. డిసెంబర్ నెల సగం గడిచినా ఉద్యోగులందరికీ వేతనాలు, జీతాలు చెల్లించలేని పరిస్థితి. ఇప్పటివరకు దాదాపు రూ.800 కోట్ల మెయింటెనెన్స్ వర్క్స్ బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఫైనల్ కాని బిల్లులు కూడా అదేస్థాయిలో ఉన్నట్లు బల్దియా వర్గాల సమాచారం.
అప్పుల కోసం వేట
బల్దియాను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న నేపథ్యంలో అప్పుల కోట వేట కొనసాగుతూనే ఉంటోంది. సమగ్ర రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టులు, కాంప్రహెన్సీల్ రోడ్డు మెయింటెనెన్స్, లింక్ రోడ్లు, చెరువు అభివృద్ధి పేరుతో జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రాజెక్టులకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రాలేదు. నగరంలో జీహెచ్ఎంసీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు బల్దియానే అప్పులు చేసింది.
గడిచిన నాలుగైదేళ్లుగా రూ.6,314 కోట్ల అప్పులు చేయగా, ఇందులో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి ఎక్కువగా అప్పులు చేసింది. ఇందులో రూ.5739 కోట్లతో పాటు బాండ్స్ విక్రయించడం ద్వారా రూ.495 కోట్లు, హడ్కో ద్వారా రూ.140 కోట్లు అప్పులు చేసింది. వీటికి వడ్డీ 8.55 శాతం నుండి 10.23 శాతం వరకు చెల్లిస్తుండగా, ప్రతి నెలా రూ.45 కోట్ల పైగా వడ్డీ చెల్లిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటేనే..
మహానగర వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్ట్ పనులు పూర్తి కావాలంటే మరో రూ.3 వేల కోట్లు అవసరమని బల్దియా అధికారులు భావిస్తున్నారు. అయితే అన్ని కోట్ల రూపాయల అప్పులు ఎలా చేయ్యాలనే అంశంపై తలలు పట్టుకుంటున్నారు. ఆదాయం పెరిగితే తప్పా అప్పులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రాజెక్టుల వారిగా ప్రత్యేక నిధులు కేటాయించాలి. బల్దియాకు గ్రాంట్లు ఇచ్చి అదుకుంటే తప్ప అప్పుల ఊబిలోంచి బయటపడటం కష్టంగా కనిపిస్తుందంటున్ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం బల్దియాను అదుకుంటుందా? ప్రత్యేక గ్రాంట్లు కేటాయిస్తుందా? అప్పుల్లోంచి జీహెచ్ఎంసీని బయటపడేస్తుందా?.. ఇప్పుడు ఇదే చర్చ కార్పొరేషన్ లో హాట్ టాపిక్ గా మారింది.
జీహెచ్ఎంసీ అప్పులు: రూ.6314 కోట్లు
ప్రతి రోజు చెల్లిస్తున్న వడ్డీ: కోటిన్నర రూపాయలు
ఎస్ ఆర్ డీపీ అప్పు: రూ.4,250 కోట్లు
నాలాల అభివృద్ధి అప్పు: రూ.700కోట్లు
రోడ్డు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ల బిల్లుల బకాయి: రూ.1304 కోట్లు
జేఎన్ఎన్ యూ ఆర్ఎం ఇళ్ల కోసం అప్పు: రూ.140 కోట్లు.