గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు.. ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
గ్రూప్-1 నోటిఫికేషన్ విషయంలో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది

హైదరాబాద్ : గ్రూప్-1 నోటిఫికేషన్ విషయంలో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం టీఎస్‌పీఎస్సీ వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నెలలో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ నిర్వహించగా, ఆ తర్వాత ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా ప్రిలిమ్స్‌ను రద్దు చేశారు. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా, నిబంధనలు సరిగా పాటించలేదని మళ్లీ ప్రిలిమ్స్ రద్దు చేశారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పలు సమస్యలపై కమిషన్ చర్చించిందని, అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రజాప్రయోజనాల దృష్ట్యా గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు.
ఇటీవల 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. మొత్తం 563 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.