Gutta Sukhender Reddy | విధాత: నా కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డికి టికెట్ కావాలని తాను అడుగలేదని, అవకాశం ఇస్తే పోటీ చేస్తాడని చెప్పానని, టికెట్ కోసం బతిమాడటాలు, బెదిరింపులు ఉండవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ అసెంబ్లీ సీట్ల టికెట్ల కేటాయింపుల్లో ప్రస్తుతానికి అవకాశాలు లేవని, సీట్లు ఉంటే ఇచ్చేవారని, లేనప్పుడు పార్టీ ఏం చేస్తుందన్నారు.
ఇప్పుడు తాను సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నానని, భవిష్యత్తులో ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ అనుకున్నంత కాలం తాను మండలి చైర్మన్ సీటులో ఉంటానని, లేదంటే నేను అనుకున్నంత కాలం ఈ కుర్చీలో కూర్చుంటానన్నారు. తర్వాత రోజుల్లో ఆయన నచ్చక పోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిది బద్‌నాం చేసే పార్టీ అని, కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడవచ్చని, ఆయన పనే ఆరోపణలు చేయటమన్నారు. బీఆరెస్‌కు కమ్యూనిస్టులు మిత్ర పక్షంగా ఉంటేనే బాగుండేదని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు. రాష్ట్రంలో మూడోసారి కూడా సీఎం కేసీఆర్ సారధ్యంలో బీఆరెస్ అధికారంలోకి వస్తుందని తాను నమ్ముతున్నానన్నారు