విధాత: ముగ్గురు పోలీసులు వేధిస్తున్నారనే ఆందోళనతో యూపీఎస్సీ అభ్యర్థి ఒకరు ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం..
ఆశిష్ కుమార్ అనే యువకుడు లక్నోలో ఉంటూ యూపీఎస్సీకి సన్నద్ధమవుతున్నాడు. ఆదివారం అతడి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అతడి సూసైడ్ నోట్ దొరకడంతో పోలీసుల వేధింపు విషయం బయటపడింది.
కాగా.. తనపై తప్పుడు కేసు నమోదు చేసి ముగ్గురు పోలీసులు వేధిస్తున్నారని ఆశిష్ అందులో వాపోయాడు. ఈ పరిస్థితుల్లో తనకు చావు తప్ప మరో మార్గం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
దీనిపై డీసీసీ మాట్లాడుతూ.. మృతుడి లేఖను ఫిర్యాదుగా తీసుకున్నామని.. ఆ ముగ్గురు పోలీసులను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.