విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ (HATHRAS RAPE CASE), హత్య కేసులో మగ్గురు నిందితులను నిర్దోషులుగా యూపీ స్పెషల్ కోర్టు విడిచిపెట్టింది. ఈ కేసులో ఒక్కడిని దోషిగా తేల్చింది. ఈ కేసులో సందీప్ (20), రవి (35), లవ్‌కుశ్ (23), రాము (26) నిందితులుగా ఉన్నారు.
వీరిలో సందీప్‌ను మాత్రమే కోర్టు హత్య కేసులో దోషిగా తేల్చింది. సందీప్‌కు యావజ్జీవ కారాగార శిక్ష (Life Imprisonment) విధించింది. 50వేలు జరిమానా కట్టాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన చెల్లి ఆత్మ ఈ తీర్పుతో క్షోభిస్తుందని బాధితురాలి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును తాము హైకోర్టులో సవాలు చేస్తామని బాధిత కుటుంబం పేర్కొన్నది.
ఇదీ కేసు
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హత్రాస్ జిల్లా బూల్‌గర్హిలో 2020, సెప్టెంబర్ 14న నలుగురు అగ్రవర్ణాలకు చెందిన యువకులు 19 ఏళ్ల దళిత యువతిపై హింసాత్మకంగా సామూహిక లైంగికదాడి చేశారు. తీవ్ర గాయాలతో ఢిల్లీలోని సఫ్టర్‌జంగ్ హాస్పిటల్(Safdarjung Hospita)లో బాధితురాలు చికిత్స పొందుతూ అదే నెల 29న చనిపోయింది.
ఆమె మృతదేహాన్ని హత్రాస్‌లోని ఆమె ఇంటికి సమీపంలో దహనం చేశారు. తమను స్థానిక పోలీసులు ఒత్తడి చేసి హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. అంత్యక్రియల వద్దకు తాను అనుమతించలేదని కూడా చెప్పారు.
ఆ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఈ ఉదంతం దేశంలో సంచలనం రేపింది. స్వతంత్ర భారతదేశంలో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న కుల వివక్షపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. కేసు వివాదం కావడంతో దర్యాప్తు బాధ్యతను సీబీఐ (CBI)కి కేంద్రం అప్పగించింది.
ఈ కేసు విచారణను చేపట్టిన అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court).. ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నది. పది రోజుల తర్వాత ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో నిందితులు నలుగురిపై సీబీఐ చార్జిషీటు నమోదు చేసింది.
వాస్తవానికి బాధితురాలు తన మరణ వాంగ్మూలంలో తనపై నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నది. అంతేకాకుండా నలుగురిలో లవ్‌కుశ్, రవి, రాము పేర్లను ప్రస్తావించింది. ఈ నలుగురూ తనను పొలంలోంచి లాక్కెళ్లి లైంగిక దాడి చేశారని తెలిపింది. కానీ.. దీనిని ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టించుకోలేదని సీబీఐ తన చార్జిషీటులో కూడా తప్పుపట్టింది.