త్వ‌ర‌లో జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఇండ్ల స్థ‌లాలు

జ‌ర్న‌లిస్టుల‌కు త్వ‌ర‌లో ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాల‌న్న ధృడ నిర్ణ‌యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నార‌ని తెలంగాణ మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ కె. శ్రీ‌నివాస్‌రెడ్డి వెల్ల‌డించారు

  • By: Somu    latest    Feb 29, 2024 11:47 AM IST
త్వ‌ర‌లో జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఇండ్ల స్థ‌లాలు
  • ధృడ నిర్ణ‌యంతో సీఎం రేవంత్ ఉన్నారు
  • మొద‌టి ప్రాధాన్య‌త జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ జ‌ర్న‌లిస్ట్‌ల‌కే
  • ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ కె. శ్రీ‌నివాస్‌రెడ్డి


విధాత‌: జ‌ర్న‌లిస్టుల‌కు త్వ‌ర‌లో ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాల‌న్న ధృడ నిర్ణ‌యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నార‌ని తెలంగాణ మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ కె. శ్రీ‌నివాస్‌రెడ్డి వెల్ల‌డించారు. గురువారం దేశోద్దార‌క భ‌వ‌న్‌లో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించిన జ‌వ‌హ‌ర్ లాల్ హౌసింగ్ సొసైటీ స‌భ్యులకు మొద‌ట ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి త‌న‌కు స్ప‌ష్టంగా చెప్పార‌న్నారు.


ఈ మేర‌కు జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి భూమిని అప్ప‌గించాల‌న్నారు. భూమిని అప్ప‌గించే ముందు ఆ భూమిపై ఏమైనా న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లున్నాయా? ప‌రిశీలించి అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌తో మాట్లాడి భూమిని అప్ప‌గించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి త‌న‌కు సీపీఆర్ ఓ బోరెడ్డి ఆయోధ్య‌రెడ్డి స‌మ‌క్షంలోనే త‌న‌కు చెప్పార‌న్నారు. ఈ మేర‌కు మార్చి 5వ తేదీన తాను సీపీఆర్ ఓ ఆయోధ్య‌రెడ్డి క‌లిసి అధికారుల‌తో స‌చివాల‌యంలో స‌మావేశం అవుతామ‌న్నారు.


అలాగే హైద‌రాబాద్‌తో పాటు జిల్లాల్లో ఉన్న జ‌ర్న‌లిస్ట్‌ల ఇండ్ల స్థ‌లాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిద్దామ‌న్నారు. జ‌ర్న‌లిస్ట్‌ల ఇండ్ల స్థ‌లాల స‌మ‌స్య‌లో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ స‌మ‌స్య‌ను వేరుగా చూడాల‌న్నారు. 2007లోనే వాళ్లు రెండున్న‌ర ల‌క్ష‌లు చెల్లించార‌న్నారు. ఆ నాడు అనేక మంది జ‌ర్న‌లిస్ట్‌లు పుస్తెలు తాక‌ట్టు పెట్టి, అన‌క చోట్ల అధిక వ‌డ్డీల‌కు డ‌బ్బులు అప్పు చేసి చెల్లించార‌న్నారు.


రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు మాత్రమే జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఇండ్ల స్థ‌లాలు ఇచ్చాయ‌ని కె. శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లో, జూబ్లీహిల్స్‌, గోప‌న‌ప‌ల్లిల‌లో ఇండ్ల స్థ‌లాలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చింద‌న్నారు. అలాగే జ‌వ‌హ‌ర్‌లాల్ జ‌ర్న‌లిస్ట్‌ హౌసింగ్ సొసైటీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఇచ్చార‌న్నారు. అయితే ఆత‌రువాత వ‌చ్చిన ప్ర‌భుత్వం ఇంటి స్థ‌లాల‌ను జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఇవ్వ‌లేద‌న్నారు. కార‌ణాలు ఏవైనా రాష్ట్రంలో తెలుగుదేశం, బీఆరెస్ పార్టీలు జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఇండ్ల స్థ‌లాలు ఇవ్వ‌లేద‌ని అన్నారు.


జ‌ర్న‌లిస్ట్‌ల‌కు హెల్త్ ఇన్సూరెన్స్,అ క్రిడిటేష‌న్ల‌కు సంబంధించి స‌మ‌స్య లు ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. సోష‌ల్ మీడియా పెరిగిన నేప‌ధ్యంలో జ‌ర్న‌లిస్ట్‌ల‌కు వృత్తి నైపుణ్యం పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణ మీడియా అకాడ‌మీ మాజీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ మాట్లాడుతూ ఇండ్ల స్థ‌లాల స‌మ‌స్య పెండింగ్‌లో ఉంద‌ని, మీడియా అకాడ‌మీకి ఆ ప్ర‌భుత్వం రూ.100 కోట్ల వెల్ఫేర్ ఫండ్ హామీ ఇచ్చింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 45 కోట్ల జ‌మ చేసింద‌ని తెలిపారు.


ఈ కార్య‌క్ర‌మంలో సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె. నారాయ‌ణ‌, తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షులు కోదండ‌రామ్‌, సీనియ‌ర్ సంపాద‌కులు కె. రామ‌చంద్ర మూర్తి, ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వ సల‌హాదారు దేవుల ప‌ల్లి అమ‌ర్‌, ఆంధ్ర జ్యోతి సంపాద‌కులు కె. శ్రీ‌నివాస్‌, సియాస‌త్ ఎడిట‌ర్ జావెద్ అలీ ఖాన్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరి, గురువారెడ్డి, సీఎం పీఆర్ ఓ బోరెడ్డి అయోధ్య‌రెడ్డి, స‌మాచార శాఖ క‌మిష‌న‌ర్ హ‌న్మంత‌రావు త‌దిత‌రులు పాల్గొన‌గా టీయూడ‌బ్ల్యుజే రాష్ట్ర అధ్య‌క్షులు కె. విరాహ‌త్ అలీ స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించారు.