Akhilesh Yadav | అఖిలేశ్ కొత్త ఎన్నిక‌ల ఫార్ములా ఫ‌లించేనా?

Akhilesh Yadav | పీడీఏ వ్యూహం విజయ తీరాల‌కు చేర్చేనా? యూపీలో వ‌రుస‌గా నాలుగుసార్లు ఓట‌మి చావో రేవో అన్న‌ట్టుగా స‌మాజ్‌వాది పార్టీ 2024 ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్య‌ కొత్త అస్త్రాలు విధాత‌: ఒక‌టి కాదు.. రెండు కాదు.. వ‌రుస‌గా నాలుగు సార్లు ఓట‌మి. సంప్ర‌దాయ ఓబీసీల ఓటు బ్యాంకు కొంత ఉన్న‌ప్ప‌టికీ త‌ప్ప‌ని ప‌రాజ‌యం. మ‌రోసారి ఓడిపోతే పార్టీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్ధక‌మ‌య్యే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాది పార్టీకి 2024లో వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌లు […]

Akhilesh Yadav | అఖిలేశ్ కొత్త ఎన్నిక‌ల ఫార్ములా ఫ‌లించేనా?

Akhilesh Yadav |

  • పీడీఏ వ్యూహం విజయ తీరాల‌కు చేర్చేనా?
  • యూపీలో వ‌రుస‌గా నాలుగుసార్లు ఓట‌మి
  • చావో రేవో అన్న‌ట్టుగా స‌మాజ్‌వాది పార్టీ
  • 2024 ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్య‌ కొత్త అస్త్రాలు

విధాత‌: ఒక‌టి కాదు.. రెండు కాదు.. వ‌రుస‌గా నాలుగు సార్లు ఓట‌మి. సంప్ర‌దాయ ఓబీసీల ఓటు బ్యాంకు కొంత ఉన్న‌ప్ప‌టికీ త‌ప్ప‌ని ప‌రాజ‌యం. మ‌రోసారి ఓడిపోతే పార్టీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్ధక‌మ‌య్యే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాది పార్టీకి 2024లో వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌లు చావో రేవో అన్న‌ట్టుగా మారాయి.

ఎలాగైనా గెలిచి తీరాల్సింద‌నే ల‌క్ష్యంతో ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ స‌రికొత్త వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాడేందుకు నూత‌న అస్త్రాల‌ను సిద్ధం చేశారు. బీసీ, ద‌ళిత‌, మైనార్టీవ‌ర్గాల ఓట్ల‌ను సాధించమే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఫార్ములా రూపొందించారు. మ‌రి ఇది ఎంత మేర‌కు ఓట్ల‌ను తెచ్చిపెడుతుందో చూడాల్సి ఉన్న‌ది.

పీడీఏ ఫార్ములాతో బ‌రిలోకి..

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త వ్యూహాన్ని అఖిలేశ్ యాద‌వ్ రూపొందించారు. పిచ్‌డే (వెనుకబడిన), దళిత, అల్ప్‌సంఖ్యక్ (మైనారిటీ)గా (పీడీఏ) వర్గీకరించిన మూడు గ్రూపుల ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి పావులు క‌దుపుతున్నారు. 2024లో జరిగే కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని బ‌లమైన‌ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – న్యూ ఇండియా, డెవలప్డ్ నేషన్, యాస్పిరేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఏ)ను ఎదుర్కోవ‌డానికి స‌రికొత్త‌గా ముంద‌డుగు వేస్తున్నారు.

మూడువ‌ర్గాల ఓట‌ర్లు 78 శాతం

యూపీలో ఓబీసీ ఓట‌ర్లు 40-45 శాతం, దళిత ఓట‌ర్లు 20 శాతం, ముస్లిం ఓటర్లు 19 శాతం ఉన్నారు. రాష్ట్రంలో ఈ మూడువ‌ర్గాల ఓట‌ర్లు 78 శాతం మంది ఉన్నారు. ఈ గ్రూపులోని పెద్ద భాగాన్ని ఆకర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా అఖిలేష్ ముందుకు సాగుతున్నార‌ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

యూపీలో అఖిలేశ్ 2014 నుంచి వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ తన పీడీఏ ఫార్ములా పార్టీ అదృష్టాన్ని మార్చగలదని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్నారు. అఖిలేశ్ ఆశ‌లు, అంచ‌నాలు, లెక్క‌లు, వ్యూహాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

యాద‌వ ఓట‌ర్లు 9 శాతం

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. యూపీలోని మొత్తం ఓబీసీ ఓటర్లలో యాదవ్ కమ్యూనిటీకి 9 శాతం ఓట్‌షేర్ ఉన్న‌ది. వీరంతా స‌మాజ్‌వాది పార్టీ సంప్రదాయ ఓటర్లు. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్‌) నిర్వహించిన పోస్ట్ పోల్ అధ్యయనం ప్రకారం 83 శాతం యాదవులు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకే ఓటు వేశారు.

అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి బీజేపీకి మారిన యాదవేతర ఓబీసీ ఓటర్లలో మిగిలిన 35% ఓట్లను సాధించడానికి అఖిలేష్ చాలా కష్టపడ్డారు. ఓబీసీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఇప్ప‌టికే చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు ఎస్పీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ పాల్ కశ్యప్ తెలిపారు. ఓబీసీల కోసం ప్రతిరోజూ 4 కార్యక్రమాలు నిర్వహిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

రాష్ట్ర జనాభాలో కుర్మీ ఓటర్లు దాదాపు ఐదు శాతం మంది ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా, వీరిలో 15 శాతం తూర్పు యూపీలో కేంద్రీకృతమై ఉన్నారు. సీఎస్‌డీఎస్ నిర్వహించిన పోస్ట్ పోల్ అధ్యయనం ప్రకారం.. 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీఏ కుర్మీ, కొయెరీ ఓట్లలో 66 శాతం ఓట్లు పొందింది. ఇది కూడా ఎస్పీ ఓట‌మికి కార‌ణ‌మైంది.

యూపీలో సోన్ లాల్ పటేల్ తన సొంత పార్టీని స్థాపించిన ప్రభావవంతమైన కుర్మీ నాయకుడు. ఆయ‌న మరణానంతరం, పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి సోన్ లాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్ ఆధ్వర్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న‌ది.

సోనెలాల్ పటేల్ మరో కుమార్తె పల్లవి పటేల్ నేతృత్వంలోని అప్నా దళ్ (కామెరవాడి) SPతో పొత్తు పెట్టుకున్న‌ది. అయితే, పీడీఏ సంకీర్ణాన్ని నిర్మించాలనే అఖిలేశ్‌ తాజా వ్యూహం వెనుక తగినంత లాజిక్ ఉన్న‌ట్టు పైకి క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. అది విజయవంతం కావాలంటే మాత్రం క్షేత్రస్థాయిలో చాలా చేయాల్సి ఉంటుంది.