తెలంగాణలో అప్రకటిత ఎన్నికల పోరు మొదలైందా? పార్టీల బలాబలాలు, బలహీనతలపై పక్కా లెక్కలతో పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయా? గెలుపు మలుపు తిప్పే వర్గాలను ఆకర్షించేందుకు ఏ ఏ పార్టీలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయి? ముఖ్యంగా మైనార్టీలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు? మైనార్టీల మనసు గెలవడం కోసం ఏ పార్టీ ఎలాంటి చాణిక్యం చేస్తోంది?
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో గెలుపు సాధనకు హోరాహోరి తలపడుతున్న అధికార బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల సాధన ఆటలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సామాజిక వర్గాల వారిగా ఓటర్లకు గాలం వేసే పోటాపోటీ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం బీఆరెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ధీటుగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, వరుస డిక్లరేషన్‌లతో రేసులో దూసుకుపోతూ త్వరలో ఓబీసీ డిక్లరేషన్ ప్రకటనకు సిద్దమైంది. కాంగ్రెస్ పథకాల దూకుడుకు చెక్ పెట్టేందుకు బీఆరెస్ ప్రతి వ్యూహాలు, బ్రహ్మాస్త్ర పథకాలకు పదును పెడుతోంది.
ముఖ్యంగా సామాజిక సమీకరణల బలాబలాల ఆటలో పైచేయి సాధించేందుకు బీఆరెస్, కాంగ్రెస్‌లు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంచుమించు 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములకు కీలకంగా ఉన్న మైనార్టీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీఆరెస్ పార్టీ మిత్రపక్షం ఎంఐఎంను గేమ్ చేంజర్‌గా కాంగ్రెస్‌పైకి ప్రయోగిస్తుంది. బీఆరెస్ వ్యూహంలో భాగంగానే పాతబస్తీకే పరిమితమవుతున్నఎంఐఎం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సారధ్యంలో ఇండియా కూటమి తెరపైకి రావడంతో మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా బీఆరెస్ మారిందన్న కాంగ్రెస్ నేతల ప్రచారం మైనార్టీల్లోకి బాగా వెళ్లినట్లు కనిపిస్తోంది. తాజా సర్వేలన్నీ ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. బీజేపీని ఓడించే కోణంలో మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా నెలకొందని, అదే జరిగితే ఎన్నికల్లో మెజార్టీ సీట్ల సాధనలో బీఆరెస్‌కు ఇబ్బంది తప్పదని ఇంటలిజెన్స్ వర్గాలు సైతం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
ఓట్ల చీలిక వ్యూహంలో భాగంగా మైనార్టీ ఓటర్లు గణనీయ స్థాయిలో ఉన్న దాదాపు 40 నియోజకవర్గాలలో ఎంఐఎం అభ్యర్థులను బరిలోకి దించేలా బీఆరెస్ అధినేత వ్యూహం పన్నినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎంఐఎంను ప్రొత్సహిస్తున్నారని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. పాతబస్తీ బయట జంట నగరాలతో పాటు జిల్లాల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లు గణనీయ స్థాయిలో ఉన్న35 నుంచి 40 నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేసిన పక్షంలో ముస్లిం ఓటర్లు ఎంఐఎంకు ఓటు వేస్తారని, అప్పుడు కాంగ్రెస్ గెలుపును నిలవరించడం సాధ్యమవుతోందని లెక్కలు వేసుకుంటున్నారు అధికార పార్టీ వ్యూహకర్తలు.
ప్రస్తుత సర్వేల్లో కాంగ్రెస్‌కు, బీఆరెస్‌కు మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉంది. కాంగ్రెస్ కంటే బీఆరెస్ పది శాతం ఓట్ల ఆధిక్యతతో ఉంది. కాంగ్రెస్ ఓటు గ్రాఫ్ ప్రతి నెలా ఒక శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. ఇలా ఎంఐఎంను బరిలో దించి మైనార్టీ ఓట్లను కాంగ్రెస్‌కు పడకుండా నిలువరించగలిగితే అధికార పార్టీకి కలిసి వస్తుందన్నది అసలైన తంత్రంగా కనిపిస్తోంది. అందుకే ఎంఐఎం అసదుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీపైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దమ్ముంటే రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పోటీ చేయాలన్ని అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసరడం కూడా మైనార్టీ ఓట్లను చీల్చే కుట్రలో భాగమేనన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.
హంగ్ వస్తే కింగ్ మేకర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ల రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించుతామని ఇప్పటికే ఎంఐఎం నేతలు అసదుద్ధీన్, అక్భరుద్ధిన్‌లు సైతం పలు సందర్భాల్లో ప్రకటించారు. పాతబస్తీలో తాము యథాశక్తిగా గెలిచే 7-8 స్థానాల సంఖ్యకు తోడుగా మరిన్ని స్థానాల్లో గెలువడం ద్వారా ఎన్నికల తరువాత హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ కావాలని ఎంఐఎం వ్యూహంగా కనిపిస్తుంది. ఎంఐఎం పాతబస్తీ బయట పోటీ చేసేందుకు సన్నద్దమవ్వడం ద్వారా ఫ్రెండ్లీ పోటీతో ఇద్దరికి రాజకీయంగా ప్రయోజనముంటుందని ఓవైసీ, కేసీఆర్‌లు అంచనా వేస్తున్నారు.
అదీగాక జాతీయ స్థాయిలో తమను బీజేపీకి బీటీమ్‌గా భావిస్తు ఇండియా కూటమిలోకి కాంగ్రెస్ ఆహ్వానించకపోవడంపై గుర్రుగా ఉన్న ఎంఐఎం అధినేత ఓవైసీ ఎక్కువ స్థానాల్లో పోటీ ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన రాహుల్‌గాంధీని టార్గెట్ చేస్తూ దమ్ముంటే హైద్రాబాద్ లోక్ సభ స్థానంలో పోటీ చేయాలంటూ సవాల్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను చీల్చి తమ విజయవకాశాలకు గండికొట్టేందుకు ఎంఐఎంను బరిలోకి దించాలన్న వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ తో ప్రతి వ్యూహాన్ని అమలు చేయనుండటం ఆసక్తికరం. మైనార్టీలతో పాటు బీఆరెస్ విస్మరించిన బీసీ సామాజిక వర్గాలు ముదిరాజ్, కురుమ, పద్మశాలి సహా ఇతర వర్గాలను, ఎస్సీలను, మహిళలను తమవైపు ఆకర్షించేలా ఎన్నికల పథకాలతో పాటు అభ్యర్థుల ఖరారులో ప్రాధాన్యతనిచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
యువత కోసం పాట్లు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా యువ ఓటర్లు కీలకంగా మారడంతో వారిని మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు పోటాపోటీ ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో యువత 30శాతం మంది ఉన్నారు. ప్రస్తుతం 3కోట్ల 6లక్ష 42వేల మంది ఓటర్లలో 18నుంచి 19వయసున్న ఓటర్లు 7లక్షల మంది ఉండగా, 19నుంచి 25ఏళ్ల వయసున్నవారు 75లక్షల మంది ఉన్నారు. తుది ఓటర్ల జాబితాలో యువ ఓటర్ల సంఖ్య మరింత పెరగడం ఖాయం. గ్రూప్ పరీక్షల గందరగోళం, పరీక్షల రద్దు, వాయిదా, కోర్టు కేసులతో నిరుద్యోగ యువత అధికార పార్టీపట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. యువతను మచ్చిక చేసుకునేందుకు బీఆరెస్ వ్యూహాలను రచిస్తుంది.
తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు, నిధులు, నియామకాల సాధనలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని యువత, విద్యార్ధి లోకం ఆగ్రహంగా ఉందని, వారి ఓట్లు తమకే అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. యూనివర్సిటీలకు, ప్రభుత్వ కళాశాలలకు, పాఠశాలలకు నిధులివ్వకపోవడం, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడం, జాబ్ నోటిఫికేషన్లలో అక్రమాలు, పేపర్ల లీకేజీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఫీజురీయంబర్స్ మెంట్ బకాయిలు, గ్రూప్స్ పరీక్షల రద్ధు, ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి విస్మరించడం వంటి వాటిపై బీఆరెస్ సర్కార్ తీరుపై యువత, విద్యార్థి అసంతృప్తితో రగిలిపోతున్నారు.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం విద్యార్ధి, నిరుద్యోగ సమస్యలపై ఒకవైపు పోరాటాలు చేస్తు వారికి అండగా ఉంటునే ఇంకోవైపు యూత్ డిక్లరేషన్ ప్రకటించి ఏటా 2లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీలలోనూ యువత, విద్యార్థులకు మేలు చేసే పథకాలు ప్రకటించింది. యువ వికాసం కింద విద్యాభరోసా కార్డుతో విద్యార్థులకు ఐదులక్షల సాయం ప్రకటించింది. మ్యానిఫెస్టోలో మరిన్ని హామీలు ప్రకటించనుంది.
ఈ నేపధ్యంలో యువతలో మెజార్టీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందన్న బెంగ బీఆరెస్‌లో గుబులు రేపుతోంది. బీజేపీ సైతం యువత ఓట్ల సాధనకు బండి సంజయ్ నేతృత్వంలో సాగించిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపైన, పేపర్ల లీకేజీ, గ్రూప్ పరీక్షల రద్దు సమస్యలపై సాగించిన పోరాటాలతో కొంత మెరుగ్గానే ప్రయత్నించింది. అయితే బీఆరెస్, బీజేపీల మధ్య లోపాయికారి పొత్తు ఉందన్న ఆరోపణల నేపథ్యంలో బీఆరెస్‌కు వ్యతిరేకంగా యువత కాంగ్రెస్‌వైపు చూస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
మహిళా ఓటర్లపై పోటాపోటీ
మహిళా ఓట్ల కోసం బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ ప్రయత్నాలే చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఓటర్లలో పురుష ఓటర్లు 1.57కోట్లు కాగా, మహిళా ఓటర్లు 1.56కోట్ల మంది ఉన్నారు. సగం మంది మహిళా ఓటర్లే ఉండటంతో వారి ఓట్ల సాధన గెలుపు ఓటములకు కీలకమైంది. ఇప్పటికే బీఆరెస్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలకు తోడు కొత్తగా మరికొన్ని పథకాలు తేవాలని బీఆరెస్ అధినేత సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి పేరుతో ప్రతినెల గృహిణులకు 2500 సహాయం, ఉచిత బస్సు ప్రయాణం, 500లకే వంట గ్యాస్, గృహజ్యోతి పేరుతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి పథకాలను ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో మరిన్ని పథకాలకు రూపకల్పన చేస్తుంది.
రైతు పథకాలలో పైచేయి ఎవరిదో..
ఎన్నికల్లో రైతు వర్గాలను ఆకర్షించేందుకు ఇప్పటికే బీఆరెస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు పథకాలు అమలు చేస్తోంది. అయితే కౌలు రైతులకు, రైతు కూలీలకు సంబంధించి బీఆరెస్ పథకాలు అందడం లేదన్న విమర్శ నెలకొంది.ఈ నేపధ్యంలో కొత్తగా రైతులకు పింఛన్ ఇచ్చే పథకం తేవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లుగా గులాబీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా రైతుల ఓట్ల సాధనకు ఆరు గ్యారంటీలలో బీఆరెస్ రైతుబంధు సాయాన్నిఎకరాకు 10వేలకు ధీటుగా రైతు భరోసా పేరుతో ఎకరాకు 15వేలకు పెంచింది.
కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపింది. భూమిలేని రైతులకు, రైతు కూలీలకు ఏటా 12వేల సాయం ప్రకటించింది. మద్ధతు ధరకు 500 బోనస్ ప్రకటించింది. ఇక బీఆరెస్ డబుల బెడ్ రూమ్‌లకు, 3 లక్షల గృహలక్ష్మికి పోటీగా కాంగ్రెస్ 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ప్రకటించింది. బీఆరెస్ ఆసరా రూ. 2016 పింఛన్‌కు పోటీగా కాంగ్రెస్ రూ. 4వేల చేయూత పింఛన్ ప్రకటించింది.పేదలకు 10 లక్షల ఆరోగ్య బీమా ప్రకటించింది.