Kavitha : తెలంగాణ విలీన దినోత్సవమే
కవిత సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవమని పేర్కొన్నారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని, మత విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత): తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలందరికీ ఆమె తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఎంకే మొయినుద్దీన్‌ని కవిత ఘనంగా సత్కరించారు.
అనంతరం కవిత మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమేనన్నారు. విమోచన దినోత్సవమంటూ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి మోదీ మీద ప్రేమ లేకపోతే తప్పుడు ప్రచారం ఆపాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. రాచరికపు నీడను అడ్డుపెట్టుకొని భూస్వాములు, దొరలు ఆనాడు చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటం చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 1942 లో సాయుధ రైతాంగ పోరాటం మొదలైంది. ఆనాటి పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ రష్యాన్ యూనివర్సిటీల్లో పాఠాలుగా చెబుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి రైతాంగ సాయుధ పోరాటం ఒక ఉదాహరణ అన్నారు.
ఆనాటి నుంచి నేటి వరకు కూడా రాచరికపు పాలనను వ్యతిరేకిస్తామని తెలంగాణ ప్రజలు ప్రతి సందర్భంలో నిరూపిస్తూనే ఉన్నారన్నారు. బీజేపీ నాయకులు ఇది ముస్లిం రాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని చిత్రీకరిస్తున్నారని తెలిపారు. అది హిందూ, ముస్లింల పోరాటం కానే కాదు. దొరలు, భూస్వాములు, రాచరిక పాలనకు వ్యతిరేక పోరాటమన్నారు. సెప్టెంబర్ 17 అంటే భారత్ లో విలీనమైన రోజుగానే భావిస్తాం. ఇక్కడి గంగా, జమున తెహజీబ్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుసునే రోజుగానే చూస్తాం. తెలంగాణ జాగృతిగా మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, అబద్దపు హామీలిస్తున్న కాంగ్రెస్ ను నిలదీస్తూనే ఉంటామని కవిత అన్నారు.