ఓయో రూమ్స్ టాక్స్ వసూళ్లపై జీహెచ్‌ఎంసీలో రగడ
టాక్స్‌ల వసూళ్ల తీరుతెన్నులపై ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్ కార్పోరేటర్ల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది

- ఎంఐఎం.. బీజేపీల మధ్య వాగ్వివాదం
విధాత, హైదరాబాద్: టాక్స్‌ల వసూళ్ల తీరుతెన్నులపై ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్ కార్పోరేటర్ల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం రెండోరోజు కొనసాగింది. బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ టాక్స్ వసూలు చేస్తున్న స్థాయిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. కనీసం పార్కింగ్ సదుపాయం కల్పించడం లేదన్నారు.
హైటెక్ సిటీ, సరూర్‌నగర్‌లో ఒకే లాగా టాక్స్ వసూలు ఎట్లా చేస్తున్నారని నిలదీశారు. టాక్స్‌పై అధికారుల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. టాక్స్ కలెక్షన్ విభాగంపై క్రెడెబిలిటీ లేదన్నారు. తీసుకునే పర్మిషన్ ఒక్కటి.. అక్కడ నడిపించేది మరోక్కటి అంటూ బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం సభ్యులు టాక్స్ వసూళ్ల చర్చలో మాట్లాడుతుండగా, పాతబస్తీలో పేరుకుపోయిన టాక్స్‌ల సంగతేమిటంటూ బీజేపీ కార్పోరేటర్లు నిలదీశారు.
ఈ సందర్భంగా రెండు పార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం సాగింది. అనంతరం ప్రాపర్టీ టాక్స్‌పై జరిగిన చర్చలో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ తీసుకుంటున్నారని బీఆరెస్ కార్పొరేటర్లు తెలిపారు. సెల్ఫ్ అసెన్మెంట్‌పై అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ప్రాపర్టీ టాక్స్‌పై చాలా ఆదాయం తగ్గుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రెసిడెన్షియల్‌ను కమర్షియల్‌గా మారుస్తున్నప్పటికీ టాక్స్ కలెక్ట్ చెయ్యకపోవడంతో జీహెచ్‌ఎంసీఆదాయం కోల్పోతుందని బీఆరెస్ కార్పొరేటర్లు వెల్లడించారు.
ఓయో రూమ్స్ పై కార్పొరేటర్ల ఫైర్
ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాల్లో ఓయో బిజినెస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెంట్స్ పేరుతో కమర్షియల్ బిజినెస్ పేరుతో వ్యాపారం చేస్తుంటే జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓయో రూమ్స్ నిబంధనలపై క్రాస్ చెక్ చెయ్యాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు.
కనీసం అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు ప్రశ్నించారు. అనంతరం మేయర్ గద్వాల విజయలక్ష్మి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.8437 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.7937 కోట్లతో సాధారణ బడ్జెట్, డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.500 కోట్లతో బడ్జెట్ రూపొందించారు.
టాక్స్ వసూళ్లలో సమస్యలు అధిగమిస్తాం: కమిషనర్ రోనాల్డ్ రోస్
టాక్స్ వసూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కార్పోరేటర్లు లేవనెత్తిన సమస్యలపై ఆయన స్పందిస్తూ ప్రాపర్టీ టాక్స్ అనేది చాలా ముఖ్యమైన మేజర్ ఆదాయ మార్గమన్నారు. రెసిడెంట్స్ నాన్ రెసిడెంట్స్‌పై టాక్స్ వేరు వేరు రేట్లు ఉన్నాయన్నారు. రేట్ల మార్పుపై 2017లో ఒకసారి 2019లో జీవోలు విడుదల అయ్యాయన్నారు. డిగ్నిటీ హౌసెస్‌కు డోర్ నంబర్స్ వేసేందుకు యాక్షన్ మొదలయిందన్నారు. ఓయో గదులపై విచారణ చేసి టాక్స్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సెల్ఫ్ అసిస్మెంట్‌పై త్వరలోనే పూర్తి ప్రకటన చేస్తామన్నారు. జీఐఎస్ (జీఐఎస్) మ్యాప్‌ను జీహెచ్‌ఎంసీలో త్వరలోనే మళ్ళీ గ్రౌండ్ చేస్తామన్నారు. టాక్స్ వసూళ్లలో చట్టం ప్రకారం వెళ్తున్నామని నిబంధనలు అతిక్రమిస్తే పెనాల్టీ వేస్తామని స్పష్టం చేశారు. సిటిలో సెల్లార్‌లలో పార్కింగ్‌పై పోలీస్-జీహెచ్‌ఎంసీ జాయింట్ సర్వే చేస్తామని వెల్లడించారు. పార్కింగ్ కోసం ఉన్న సెల్లార్‌లను ఇతర అవసరాలకు వాడితే కఠినమైన చర్యలు ఉంటాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ హెచ్చరించారు.