ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం ఇదే!

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం ఇదే!
  • 126వ ర్యాంకులో భార‌త‌దేశం
  • 131వ స్థానానికి దిగ‌జారిన అమెరికా
  • కాంగోలో అత్యంత అభ‌ద్ర‌త‌
  • గ్లోబ‌ల్ పీస్ ఇండెక్స్ నివేదిక వెల్ల‌డి


వాషింగ్ట‌న్ : ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాంతియుత ప‌రిస్థితులు క్ర‌మంగా క్షీణిస్తున్న‌ప్పటికీ ఒక దేశం మాత్రం ప్ర‌పంచంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన దేశంగా గ‌త ప‌దిహేను సంవ‌త్స‌రాల నుంచి త‌న స్థానాన్ని ప‌దిలంగా ఉంచుకుంటున్న‌ది. మ‌న దేశం మాత్రం 126 స్థానంలో నిలిచింది. గ్లోబ‌ల్ పీస్ ఇండెక్స్ నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో అమెరికా 131వ స్థానానికి ప‌డిపోయింది. అయితే.. ఐస్‌లాండ్ మాత్రం త‌న మొద‌టి స్థానాన్ని భ‌ద్రంగా నిలుపుకొన్న‌ది. అందులోనూ గ‌త 15 ఏళ్లుగా ఆ దేశం ర్యాంక్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. 2009 నుంచి 2020 మ‌ధ్య ఆయా దేశాల్లో అభివృద్ధి, శాంతి విష‌యాల్లో 126 దేశాల్లో ప‌రిస్థితులు మెరుగుప‌డినా.. 2023 నివేదిక ప్ర‌కారం శాంతియుత ప‌రిస్థితులు క్షీణించిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇందులో 84 దేశాలు కొంతమేరకు ప్ర‌గ‌తి సాధించాయి. మరో 79 దేశాల్లో శాంతియుత పరిస్థితులు మరింత దిగజారాయ‌ని గ్లోబ‌ల్ పీస్ ఇండెక్స్ నివేదిక పేర్కొంటున్న‌ది.


మొత్తం మీద కొవిడ్- 19 అనంతరం ప్రపంచం వ్యాప్తంగా అశాంతికి, అలజడికి ముఖ్య కారణం అయ్యింది. దీనివల్ల అనేక దేశాల్లో అనేక సమస్యలు తలెత్తి ఆ దేశాల ర్యాంకులు దిగ‌జారాయి. కొవిడ్ -19 మహమ్మారి వల్ల ఆ దేశాల వ్యవస్థల్లో సామాజిక అశాంతి తీవ్రతరమవడం, రాజ‌కీయ అస్థిర‌త నెల‌కొన‌డం సాధార‌ణ ల‌క్ష‌ణ‌మైంద‌ని నివేదిక తెలిపింది. అమెరికా 131వ స్థానంలోకి ఘోరంగా పడిపోయింది. ప్రస్తుతం అమెరికా ప్రపంచ అశాంతికి మారుపేరుగా మారిందంటే ఆశ్చ‌ర్యం లేదు. ఇండియా ఈ ర్యాంకింగ్ లో 126 వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ముఖ్యంగా 23 విషయాల్లో ప్రామాణికతలను నిర్ధారిస్తుంది. వాటిల్లో సామాజిక శాంతి, సురక్ష‌, రక్షణ, ఆదాయం, వ్యాపారం వంటి విషయాలపై నిశిత సర్వేలు నిర్వహిస్తుంది. త‌ర్వాతి స్థానాల్లో డెన్మార్క్‌, ఐర్లాండ్ , న్యూజిలాండ్ నిలిచాయి. అత్యంత అశాంతి దేశాలుగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, సౌత్ సూడాన్, సిరియా, యెమన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.