Kanche Gachibowli lands: పర్యావరణం పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందే : సుప్రీంకోర్టు
కంచె గచ్చిబౌలి భూములపై మరోసారి ఆగ్రహం
పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం
జూలై 23కు కేసు వాయిదా
Kanche Gachibowli lands: : కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ఆ భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం గురువారం ఈ కేసులో విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించింది. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారని… డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారని..ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలంది. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని.. పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే సీఎస్ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు.. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండని..నష్ట నివారణకు, పర్యావరణ పునరుద్దరణకు తీసుకోబోయే చర్యలను తెలుపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ కంచె గచ్చిబౌలిలో పనులన్నీ నిలిపి వేశామని వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేస్తామని చెప్పారు. రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వీ కోరారు. కేంద్ర సాధికార సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సమయం కోరారు.
అనంతరం విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై కేసుల విషయాన్ని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని కోర్టు తెలిపింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్‌తో రావాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram