Tamil Nadu: దేశ చరిత్రలో సంచలనం..! తమిళనాడులో రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండా చట్టాల అమలు !!
గవర్నర్, రాష్ట్రపతి సమ్మతి లేకుండా తమిళనాడులో 10చట్టాలు అమల్లోకి వచ్చాయి. గణతంత్ర భారత దేశ చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి అని రాజ్యాంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Tamil Nadu: గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం 10చట్టాలను అమల్లోకి తెచ్చింది. గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల వివాదంపై ఇటీవల సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం 10చట్టాలను గెజిట్ నోటిఫై(Notifies 10 Acts) చేస్తూ జీవోలు విడుదల చేసింది. గణతంత్ర భారత దేశ చరిత్రలో గవర్నర్, రాష్ట్రపతి సమ్మతి లేకుండా చట్టాలు అమల్లోకి రావడం ఇదే తొలిసారి అని రాజ్యాంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆసక్తికర మలుపులు తిరిగిన పెిండింగ్ బిల్లుల వివాదం
తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకున్నారని తమిళనాడు ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలోను ఆయన తీరు మారడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీం తీర్పు వెలువరించింది. శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని జస్టిస్ జె.బి.పర్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘గవర్నర్ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి పెట్టడం న్యాయ సమ్మతం కాని ఏకపక్ష చర్య అని.. అందుకే ఆ చర్యను తోసిపుచ్చుతున్నాం’’ అని పేర్కొంది. పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టంచేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది.
బిల్లులపై గవర్నర్ కాలపరిమితి పాటించాల్సిందే
గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించనిపక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. అసెంబ్లీలో తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్‌కు సమర్పించిన 2023 నవంబర్ 18 నాడు ఆ బిల్లులు ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాలు (రెండవ సవరణ) 2022, తమిళనాడు ఫిషరీస్ యూనివర్శిటీ (సవరణ) చట్టం 2020 (గతంలో తమిళనాడు డాక్టర్ జే జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీగా ఉన్న పేరు మార్పు), ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాన్ని గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు వంటి చట్టాలను గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫై చేశారు. ఈ సందర్భంగా డీఎంకే అంటే చరిత్రను సృష్టించడం అని సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.