August | 123 ఏండ్లలో.. అత్యంత ‘పొడి’ ఆగస్ట్‌

August | 21 వరకు 115.4 మి.మీ. వర్షపాతం గత రికార్డు 2005లో 190.1 మి.మీ. నెలాఖరుకు మరో కొత్త రికార్డు న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్ట్‌ గత 123 ఏండ్లలోనే అత్యంత ‘పొడి’ ఆగస్ట్‌ అని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఆగస్ట్‌ నెలలో 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 115.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనికి ముందు రికార్డు 2005లో 190.1 మిల్లీమీటర్లుగా ఉన్నది. ఒకవైపు హిమాలయ రాష్ట్రాలు, ప్రత్యేకించి […]

August | 123 ఏండ్లలో.. అత్యంత ‘పొడి’ ఆగస్ట్‌

August |

  • 21 వరకు 115.4 మి.మీ. వర్షపాతం
  • గత రికార్డు 2005లో 190.1 మి.మీ.
  • నెలాఖరుకు మరో కొత్త రికార్డు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్ట్‌ గత 123 ఏండ్లలోనే అత్యంత ‘పొడి’ ఆగస్ట్‌ అని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఆగస్ట్‌ నెలలో 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 115.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనికి ముందు రికార్డు 2005లో 190.1 మిల్లీమీటర్లుగా ఉన్నది. ఒకవైపు హిమాలయ రాష్ట్రాలు, ప్రత్యేకించి హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లు కుండపోత వర్షాలను ఎదుర్కొన్నప్ప టికీ దేశ సగటు భారీగా పడిపోవడం గమనార్హం.

రోజువారీ భారతదేశ సగటును పరిగణనలోకి తీసుకుంటే.. రుతుపవన విరామ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మరింత తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ ఆగస్ట్‌ కొత్త రికార్డు సృష్టించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’ అని బ్రిటన్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌, యూనివర్సటీ ఆఫ్‌ రీడింగ్‌లోని వాతావరణ శాఖలో రిసెర్చ్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అక్షయ్‌ దియోరాస్‌ ‘డౌన్‌ టు ఎర్త్‌’ మ్యాగజైన్‌కు చెప్పారు.

నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం విరామ దశలో ఉన్నాయి. మరోవైపు భారీ వర్షాలతో ఉత్తరాదిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవన విరామ దశలో హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకే వర్షాలు పరిమితమయ్యాయి. తాజా విరామం.. ఆగస్ట్‌ 7 నుంచి 18 వరకు కొనసాగింది.

ఒక విధంగా ఇది కూడా రికార్డే. 21వ శతాబ్దంలో 2002, 2009 తర్వాత ఇది మూడో అతిపెద్ద విరామం. రుతుపవనాలు ఉత్తరాదివైపు మళ్లడం ఆగస్ట్‌ 21 నుంచి ప్రారంభమవుతుందని, 24వ తేదీ నాటికి అక్కడ స్థిరపడతాయని దియోరాస్‌ చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పటికీ.. అది రుతుపవనాలను క్రియాశీలం చేయలేక పోయింది.

‘ఇప్పుడు అల్పపీడన ద్రోణి వెళ్లిపోయింది కనుక.. రుతుపవనం.. మళ్లీ విరామ దశలోకి వచ్చింది’ అని ఆయన వివరించారు. చివరి రుతుపవన విరామ కాలంలో ఆగస్ట్‌ 14 నుంచి 20వ తేదీ మధ్య భారీ నుంచి అతిభారీ వర్షాలు కొండ రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడేందుకు, ఆకస్మిక వర్షాలకు కారణమయ్యాయి. వాటితో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకున్నాయి. వర్షాలతో వేర్వేరు ఘటనల్లో 78 మంది చనిపోయారు.

అయితే.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. ‘ఈ వారంలో కొండ రాష్ట్రాల్లో, పొరుగున నేపాల్‌లో వర్షాలు పెరుగుతాయి. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌తోపాటు.. పొరుగున నేపాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. దీని వల్ల మళ్లీ కొండచరియలు విరిగిపడే, వరదలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.