అయ్యప్ప దీక్షాపరులకు గుడ్‌న్యూస్‌.. శబరిమలకు భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే

దక్షిణ మధ్య రైల్వే అయ్యప్ప భక్తులకు శుభవార్తను చెప్పింది. అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది

  • By: Somu |    latest |    Published on : Dec 13, 2023 4:24 AM IST
అయ్యప్ప దీక్షాపరులకు గుడ్‌న్యూస్‌.. శబరిమలకు భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే

Special Trains To Sabarimala | దక్షిణ మధ్య రైల్వే అయ్యప్ప భక్తులకు శుభవార్తను చెప్పింది. అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. డిసెంబర్‌, జనవరి వరకు దాదాపు 51 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది.


 

సికింద్రాబాద్‌-కొల్లం, కొల్లం-సికింద్రాబాద్‌, నర్సాపూర్‌-కొట్టాయం, కొట్టాయం-నర్సాపూర్‌, విజయవాడ – కొట్టాయం, కొట్టాయం -విజయవాడ, మచిలీపట్నం – కొట్టాయం, నాందేడ్‌ – ఈరోడ్‌, ఆదిలాబాద్‌ – కొట్టాయం, శ్రీకాకుళం – కొల్లం, విశాఖపట్నం – కొల్లం తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.


ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు తరలివెళ్తున్నారు. ఇప్పటికే భారీగానే ప్రత్యేక రైళ్లను నడిపించింది. ఊహించినదాని కంటే ఎక్కువగానే శబరిమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యార్థం భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.


కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో శబరిమల ఆలయం ఉన్నది. ఏడాది మండల-మకరవిళక్కు వేడుకల నేపథ్యంలో నవంబర్‌ 17న అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి రెండునెలల వరకు స్వామివారిని దర్శనం భక్తులకు కల్పించనున్నారు. మకరవిళక్కు సీజన్‌లో లక్షలాది మంది భక్తులు శబరిమలను దర్శిస్తుంటారు. మలయాళ నెల వృశ్చికం తొలిరోజున మకరవిళక్కు వేడుకలు ప్రారంభవగా.. జనవరిలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు.